స్కీమ్​ల పేరుతో రూ.2 కోట్లు కొట్టేసింది

స్కీమ్​ల పేరుతో రూ.2 కోట్లు కొట్టేసింది
  • తక్కువ రేటుకు బైక్​లు అమ్ముతమంటూ 300 మందిని మోసం చేసిన మహిళ
  • నిందితురాలితో పాటు మరో వ్యక్తి అరెస్ట్ 

నేరెడ్​మెట్, వెలుగు: తక్కువ రేటుకు బైక్​లు అమ్ముతామంటూ స్కీమ్​ల పేరుతో 300 మందిని మోసం చేసి సుమారు రూ.2 కోట్లు కొట్టేసిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన వ్యక్తిని జవహర్​ నగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. శనివారం రాచకొండ సీపీ మహేశ్​భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన కంకుల పల్లవి రెడ్డి(32)  శ్రీ సాయి నిత్య ట్రేడర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో 2019లో ఏఎస్ రావునగర్​లో, గతేడాది దమ్మాయిగూడలోని దోమడుగు గ్రామంలో బైక్ షోరూమ్ లను ప్రారంభించింది. ఈజీ మనీ కోసం స్కీమ్​ల పేరుతో కస్టమర్లను మోసం చేసేందుకు స్కెచ్ వేసింది. మొదటి స్కీమ్ లో భాగంగా బైక్ కొనే వారు దాని రేటులో 60 శాతం డబ్బు కడితే 40 శాతం డిస్కౌంట్ ​ఇస్తామని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన కొందరు కస్టమర్లు 60 శాతం డబ్బు కట్టారు. తర్వాత  20 శాతం డబ్బును కస్టమర్ పేరుపై బ్యాంక్ నుంచి లోన్ తీసి ఆ డబ్బును తన అకౌంట్​లో వేసుకుని 12 ఈఎంఐలు తానే కడతానని చెప్పింది. ఫైనాన్స్ వచ్చిన తర్వాత బైక్ డెలివరీ ఉంటుందని నమ్మించింది. 60 శాతం డబ్బు కట్టిన కస్టమర్ అతడితో పాటు మరో నలుగురిని ఈ స్కీమ్ లో చేర్పిస్తేనే డిస్కౌంట్ వర్తిస్తుందని కండీషన్ పెట్టేది. రెండో స్కీమ్​లో భాగంగా బైక్ రేటులో 50 శాతం చెల్లించిన కస్టమర్​కు 100 రోజుల తర్వాత డెలివరీ ఉంటుందని చెప్పి  డబ్బులు వసూలు చేసింది. థర్డ్ స్కీమ్​లో భాగంగా ఎవరైతే కస్టమర్లు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో 100 రోజుల తర్వాత రెట్టింపు ఇస్తానని చెప్పింది.

ఇలా పల్లవి రెడ్డి చెప్పిన మూడు స్కీమ్​లలో దాదాపు 300 మంది డబ్బులు కట్టి చేరారు.  జవహర్ నగర్ పరిధి మోహన్ రావు నగర్ లో ఉంటూ సెక్యూరిటీ సర్వీసెస్ జాబ్ చేసే పోలోజు సంజయ్(34)తో కలిసి పల్లవి రెడ్డి కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బు తీసుకుని, రెండు బైక్ షోరూమ్​లను ఎత్తేసి పారిపోయింది. పల్లవి రెడ్డి స్కీమ్స్​లో చేరి మోసోయినట్లు ఈ నెల 11న మౌలాలికి చెందిన మహేశ్వరి పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసిన జవహర్ నగర్ పోలీసులు పల్లవి రెడ్డి, సంజయ్​ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరితో పాటు మరో 9 మంది పల్లవి రెడ్డిపై   కంప్లయింట్ చేశారని సీపీ మహేశ్​భగవత్ చెప్పారు. నిందితుల నుంచి సెల్​ఫోన్, కంప్యూటర్​, దమ్మాయిగూడలోని నిత్య మోటర్స్​కి సంబందించిన డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. నిందితులను కోర్టులో  హాజరుపరిచి పూర్తి విచారణ చేపడతామన్నారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు కంప్లయింట్ చేయాలని కోరారు.