
వెంకటాపూర్(రామప్ప), వెలుగు : ఓ యువకుడిని కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టడంతో.. తామే చంపినట్లు యువకుడి తండ్రి, అన్న, బాబాయి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మద్యానికి బానిసై, బెట్టింగ్‌లో ఆస్తులు పోగొట్టడం వల్లే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో ఈ నెల 7న జరిగిన యువకుడి హత్య కేసు వివరాలను బుధవారం పోలీసులు వెల్లడించారు. ములుగులో ఉంటున్న దుర్గం సూరయ్య తనకున్న నాలుగు ఎకరాలను ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చాడు. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో ఉంటున్న చిన్న కుమారుడు అశోక్(40) మద్యానికి బానిసై, బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పులపాలై తన వాటా భూమిని అమ్మేశాడు.
దీంతో పాటు తల్లిదండ్రులను బెదిరించి డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 7న అశోక్ ములుగులోని తండ్రి వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు. దీంతో సూరయ్య తన పెద్దకొడుకు సంపత్, తమ్ముడు సాంబయ్యను పిలిచి అశోక్ మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం తీగల అశోక్ సాయంతో డెడ్‌బాడీని కారులో వేసుకొని లక్ష్మీదేవిపేటలోని అశోక్ ఇంటికి వెళ్లి అక్కడ పడుకోబెట్టారు.
తెల్లారి అశోక్ లేవకపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి అతడి భార్యకు, కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు అశోక్‌ది ఆత్మహత్య అని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే అశోక్ మృతిపై అనుమానాలు తలెత్తడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో తామే హత్య చేసినట్లు మృతుడి తండ్రి సూరయ్య, అన్న సంపత్, బాబాయి సాంబయ్య బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు.