ఇటీవల చిన్న చిన్న కారణాలే హత్యలకు దారి తీస్తున్నాయి. రెండు రోజుల క్రితం మెదక్ జిల్లాలో కేవలం రూ.22 విషయంలో గొడవ తలెత్తి ఓ యువకుడు ఫ్రెండ్‌ను కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మురువక ముందే అదే ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. అన్నం తిన్న ప్లేటులో చేయి కడిగాడని ఫ్రెండ్‌ను కొట్టి చంపాడు యువకుడు.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ హోమ్ ట్రీ అపార్ట్మెంట్లో శ్యామ్ పంచాలు (28), మిథ్లేష్ కుమార్, అతుల్ సహానీ అనే ముగ్గురు ఫ్రెండ్స్ అద్దెకు ఉంటున్నారు. అయితే.. సోమవారం (జనవరి 19) రాత్రి భోజనం చేస్తున్న సమయంలో అతుల్ సహానీ తిన్న ప్లేటులో శ్యామ్ పంచాలు చేయి కడిగాడు.
ఈ విషయంలో శ్యామ్, అతుల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఘర్షణ మరింత ముదరడంతో తీవ్ర కోపాద్రిక్తుడైన అతుల్ సహాని పక్కనే ఉన్న పప్పు కుక్కర్‌తో శ్యామ్ తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు తీవ్రంగా గాయమవడంతో శ్యామ్ అక్కడికక్కడే మరణించాడు.
సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్యామ్ హత్యకు కారణం ఇదేనా.. మరేదేమైనా ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
చిన్న కారణంతో ఒక నిండు ప్రాణం బలికావడం స్థానికంగా కలకలం సృష్టించింది. క్షణికావేశంలో ఒక వ్యక్తి ప్రాణం తీయడం, మరొకరు జైలు పాలు కావడం ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మనుషులు ఇలా తయారవుతున్నారేంటి..? ఇంత చిన్న కారణానికి కూడా చంపేస్తారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
