పోలీసులు విచారణకు పిలిచారని యువకుడి ఆత్మహత్య

పోలీసులు విచారణకు పిలిచారని యువకుడి ఆత్మహత్య

నేరేడుచర్ల, (పాలకవీడు), వెలుగు: రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో పోలీసులు విచారణకు పిలిచారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే సంబంధం లేకున్నా అకారణంగా పిలిచి ఎంక్వైరీ చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు,స్నేహితులు డెడ్ బాడీతో  పీఎస్​ముందు ధర్నా చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..డిసెంబర్ 31న రాత్రి 8:30 గంటలకు పాలకవీడుకు చెందిన పగడాల జ్యోతిబసు అతని స్నేహితుడు ఎర్రగోర్ల సైదులు గుడుగుంట్లపాలెం వైపు బైక్ పై వెళ్తున్నారు. శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో పాలకవీడుకే చెందిన షేక్ నాగుల్ మీరా (20) బైక్​పై వెళ్తూ ఢీకొట్టాడు. దీంతో జ్యోతి బసు గాయపడ్డాడు. జ్యోతిబసు తండ్రి పాలకవీడు పీఎస్​లో కంప్లయింట్​ చేశాడు. దీంతో ఆదివారం విచారణ కోసం నాగుల్​మీరాను పోలీసులు పిలిచారు. అయితే ప్రమాదానికి తనకు సంబంధం లేదని, తననే వారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టారని వివరణ ఇచ్చి వెళ్లిపోయాడు. సోమవారం మళ్లీ పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడారు. కానీ ఇక్కడేమీ తేలలేదు. తర్వాత నాగుల్​మీరా ఇంటికి వెళ్లిపోయాడు.

మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తప్పుడు కేసుపెట్టడంతోనే మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని, కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని నాగుల్ మీరా మృత దేహంతో అతడి కుటుంబ సభ్యులు పాలకవీడు పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. 4 గంటలకు పైగా నిరసన తెలపడంతో  నేరేడుచర్ల–జాన్​పహాడ్ రోడ్డు పై ట్రాఫిక్​జామ్​ ఏర్పడింది. దీంతో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి వచ్చి మాట్లాడారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా ధర్నా విరమించలేదు. దీంతో సర్కిల్​ఎస్సైలు సైదులు గౌడ్, నవీన్ కుమార్, కొండల్ రెడ్డి, వెంకటరెడ్డి, రవి ఆందోళనకారులను చెదరగొట్టి మృతదేహాన్ని హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు