- ఫోన్ నంబర్, బయోమెట్రిక్, ఐరిస్ అప్‌డేట్ చేసుకోవాలంటున్న ఆఫీసర్లు
- ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్‌లోనే డిపాజిట్ కానున్న డబ్బులు
మంచిర్యాల, వెలుగు : ఈ సీజన్‌లో పత్తి అమ్మకాలకు ఆధార్ కీలకంగా మారనుంది. పత్తి అమ్మాలనుకునే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్‌లో వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది రైతులు ఆధార్‌కు ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోకపోవడం, ఇప్పటికే లింక్ చేసుకున్న వారు బయోమెట్రిక్, ఐరిస్ అప్‌డేట్ చేసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయని ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో పత్తి అమ్మాలనుకునే రైతులు ముందుగానే ఆధార్‌కు ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.
ఇక ఆధార్ కార్డుపై ఫొటో ఉన్న రైతే కొనుగోలు కేంద్రాల వద్ద తక్‌పట్టి ఫొటో దిగాల్సి ఉన్నందున.. ఒక రైతు పేరిట రిజిస్ట్రేషన్ చేసుకొని, మరో రైతు సీసీఐ సెంటర్‌కు వచ్చి పత్తి అమ్మడం కుదరదని చెబుతున్నారు. రైతుకు ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశాడు, దిగుబడి ఎంత వస్తుందన్న క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా రైతులు ఏఈవోల నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అలాగే తడిసిన, రంగు మారిన, నాణ్యత లేని పత్తిని సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
