- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎంపీగడ్డం వంశీకృష్ణ భేటీ
- ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్న ఏఏఐ టీం
- రామగుండం ఎయిర్‌పోర్ట్‌కు సహకరించాలని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన మంత్రి, సహకరిస్తానని హామీ
న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెల 3 లేదా 4 వ తేదీన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టీం రామగుండం రానుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. అంతర్గాం మండలంలోని ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించి ల్యాండ్ సర్వే చేయనున్నట్లు చెప్పారు. ఈ ఫ్రీ–ఫీజిబిలిటీ స్టడీ టూర్ పూర్తయ్యాక భూసేకరణతోపాటు తుది నిర్ణయాలు త్వరలో తీసుకుంటుందన్నారు. రామగుండంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటే లక్ష్యంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.
ఇందులో భాగంగా సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన.. రామగుండంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎయిర్‌పోర్ట్‌కోసం చివరిదాకా పోరాడుతా
రామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకోసం అనేకసార్లు కేంద్ర మంత్రిని కలిసి కోరినట్లు వంశీకృష్ణ గుర్తుచేశారు. అయితే, ఎయిర్‌పోర్టుకోసం గతంలో ప్రతిపాదించిన ప్రాంతం సరిగా లేదని.. కొండలు, గుట్ట ప్రాంతం ఉన్నందున అక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాధ్యంకాదని స్టడీ టీం రిజెక్ట్ చేసిందని తెలిపారు. అందువల్ల ఫ్రీ–ఫీజిబులిటిని కొత్త లోకేషన్‌కు మార్చి, మరోసారి కేంద్రంపై ఒత్తిడి పెంచామన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో ఫ్రీ–ఫీజిబులిటి కోసం కేంద్ర పౌర విమానయాన శాఖకు దాదాపు రూ. 50 లక్షలు చెల్లించామన్నారు.
ఈ అంశాలపై తాజా భేటీలో కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తిపై స్పందించిన రామ్మోహన్ నాయుడు.. రామగుండంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు దిశగా ఏఏఐ స్టడీ టీంను పంపుతామని హామీ ఇచ్చారన్నారు. ఈ నెల 3 లేదా 4వ తేదీల్లో ఈ అధికారుల బృందం ప్రతిపాదిత అంతర్గాం మండలంలో పర్యటిస్తుందన్నారు.
ఈ ఎయిర్ పోర్ట్ వస్తే.. ఆదిలాబాద్, మంచిర్యాల, రామగుండంతో పాటు సమీప ప్రాంతాల అభివృద్ధి చెందుతాయన్నారు. రామగుండంలో ఎయిర్ పోర్ట్ కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ విషయంలో ఎంపీగా తాను చివరిదాకా పోరాడుతానని వంశీకృష్ణ స్పష్టం చేశారు.
