
ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాట సాయం చేస్తుంటాం. అయితే ఆమిర్ ఖాన్ మాత్రం ఆట సాయం చేస్తున్నాడు. కరోనా బాధితులకు తన ఆట ద్వారా హెల్ప్ అందేలా చేయబోతున్నాడు. ప్రముఖ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో చెస్ ఆడబోతున్నాడు ఆమిర్. చెస్ డాట్‌కామ్ ఇండియా ఈ గేమ్‌ను నిర్వహించబోతోంది. జూన్ 13న సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్య ఆట సాగుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు లాగిన్ అయ్యి చూడొచ్చు. తమకు తోచినంత విరాళాన్ని ఇవ్వవచ్చు. ఆ మొత్తాన్ని కరోనా బాధితుల కోసం ఖర్చుపెడతారు. ఆమిర్ లాంటి స్టార్ పార్టిసిపేట్ చేయడం వల్ల విరాళాలు భారీ మొత్తంలో వస్తాయని ఆ సంస్థ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. నిజానికి ఆమిర్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో కూడా ఓసారి ఆనంద్‌తో చెస్ ఆడి విరాళాలు సేకరించాడు. ఇప్పుడు మరోసారి ముందుకొచ్చాడు. విశేషమేమిటంటే రీసెంట్‌గా విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ తీయాలని ఓ నిర్మాత ప్లాన్ చేశారు. ఆనంద్ పాత్రను ఆమిరే చేస్తాడన్నారు. కానీ డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల ఆమిర్‌కి వీలు కాలేదు. దాంతో ధనుష్‌తో తీసేందుకు ట్రై చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ‘లాల్‌సింగ్ ఛద్దా’ మూవీ చేస్తున్నాడు ఆమిర్. ఇందులో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సెకెండ్ వేవ్ వల్ల బ్రేక్ పడింది. త్వరలో షూట్ రీస్టార్ట్ కానుంది.