చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఎసరు!

చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఎసరు!
  • ఆ పార్టీ స్థానంలో పాగా వేసేందుకు ఆప్, టీఎంసీ ప్లాన్
  • యూపీతో పాటు ఐదు రాష్ట్రాలకు వచ్చే ఏడాదే ఎన్నికలు 
  • రెండు పార్టీల రాకతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొంప మునిగే చాన్స్  

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్​కు ఎసరు పెట్టే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్లాన్ వేస్తున్నాయి. స్మాల్ స్టేట్స్ లో కాంగ్రెస్ కు పక్కలో బల్లెంలా మారి, అధికారం చేజిక్కించుకునేలా ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. ఇందులో భాగంగానే త్వరలో రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. యూపీతో పాటు గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలూ రానున్నాయి. ఆయా రాష్ట్రాల ఎన్నికల బరిలోకి ఆప్, టీఎంసీ ప్రవేశంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు భారీగా చీలిపోతుందని, చివరకు ఆ పార్టీ కొంప మునగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.  

పంజాబ్ పై కేజ్రీవాల్ కన్ను  
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండోసారి అధికారం దక్కించున్న ఆప్.. ఇప్పుడు పక్క రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోంది. పంజాబ్ ఎన్నికల్లోనూ గెలిచి, ఆ స్టేట్ లోనూ అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే చాపకింద నీరులా పంజాబ్ అంతటా పార్టీ విస్తరణపై ఆప్ నేతలు దృష్టి పెట్టారు. పంజాబ్ లో ఆప్ బలపడుతుండటంతో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకే అధికారం దక్కుతుందంటూ పలు సర్వేలు కూడా వెల్లడించాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, రాజీనామా పర్వాలు ఆప్ పార్టీకి అనుకూలంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఢిల్లీ అభివృద్ధి మోడల్ ను చూపి, పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్ట్రాటజీలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ కంటే తామే బలమైన ప్రత్యర్థి అని చాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ వరుసగా పంజాబ్ పర్యటనలు చేపడుతున్నారు. 

గోవాపై దీదీ ఫోకస్  
బెంగాల్ లో తృణమూల్ ను మూడోసారి అధికారంలోకి తెచ్చిన ఆ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు పలు చిన్న రాష్ట్రాలకు తమ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ప్రధానంగా అస్సాం, గోవా రాష్ట్రాలపై మమత ఫోకస్ పెట్టారు. ఈ రెండు చిన్న రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం పక్కా స్ట్రాటజీలతో ఆమె పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని పెద్ద లీడర్లను తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే అస్సాంలో కాంగ్రెస్ లీడర్ సుస్మితా దేవ్ ను టీఎంసీలో చేర్చుకున్నారు. ఇటీవల గోవాలోనూ కాంగ్రెస్ మాజీ సీఎం లుజిన్హో ఫెలిరోను తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించగా, ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం కోల్ కతాలో మమత సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు. 

టార్గెట్ కాంగ్రెస్..
చిన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రధానం గా కాంగ్రెస్ నే ఆప్, టీఎంసీ టార్గెట్ చేస్తు న్నాయి. కాంగ్రెస్ నేతలను తమ పార్టీల్లో చేర్చుకుంటూ, కాంగ్రెస్ ఓటు బ్యాంకును సొంతం చేసుకుంటూ సత్తా చాటాలని భావిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల్లో కుమ్ములాటల వల్ల పార్టీ సంక్షోభం లో కూరుకుపోతోంది. పార్టీని ఒక్కతాటి పై నడిపే నాయకులు లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. సరిగ్గా ఈ అంశాన్నే ఆసరాగా చేసుకుని తమ పార్టీలను ఆయా రాష్ట్రాల్లోకి విస్తరించాలని కేజ్రీవాల్, మమత ప్లాన్ వేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్, గోవా వంటి పలు చిన్న రాష్ట్రాల్లోనూ తమ అభివృద్ధి మోడల్ ను చూపుతూ అక్కడ పాగా వేసేందుకు ఆప్, టీఎంసీ ప్రయత్నిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్, టీఎంసీ పుంజుకుంటే.. ఆ ప్రభావం 2024 జనరల్ ఎలక్షన్స్ లోనూ ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పార్టీలు సత్తా చాటే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు.