పెద్దల సభలో యంగెస్ట్ ఎంపీగా రాఘవ్ రికార్డ్

పెద్దల సభలో యంగెస్ట్ ఎంపీగా రాఘవ్ రికార్డ్

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఇవాళ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ను కలిసి తన రాజీనామా పత్రం అందజేశారు. ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయడంతో తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో తోటి ఎమ్మెల్యేలు ఆయనకు వీడ్కోలు చెప్పారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా రాఘవ్ చద్దాకు అభినందనలు తెలిపారు. పార్లమెంటులో తన వంతు పాత్రను పోషించాలని, కొత్త పదవిలో దేశానికి చేయగలిగినంత సేవ చేయాలని ఆకాంక్షించారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే రామ్ వీర్ బిధౌరి తాను వాడే పెన్ ను రాఘవ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. తన ఫేర్వెల్ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడి నుంచి ఈ కానుక అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు. 

మారుతోంది సభే.. సేవ, పోరాటం కాదు

అసెంబ్లీలో ఇవాళ తనకు చివరి రోజని, ఈ చిన్న వయసులోనే ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు అని రాఘవ్ చెప్పారు. ఇకపై తాను ఉండే సభ మాత్రమే మారుతోందని, తాను చేసే సేవ, పోరాటం మాత్రం అలానే కొనసాగుతాయని తెలిపారు. పంజాబ్ అభివృద్ధి కోసం రాజ్యసభలో తన వంతుగా చేయాల్సిందంతా చేస్తానని అన్నారు. సభలో అన్ని రకాల సమస్యలపై తన గొంతు వినిపిస్తానని చెప్పారు.

పెద్దల సభలోకి చిన్న వయసులో..


అతి చిన్న వయసులోనే రాజ్యసభకు ఎంపికైన నేతగా రాఘవ్ చద్దా రికార్డు సృష్టించారు. 33 ఏండ్ల వయసులోనే ఆయన రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పటి వరకు యంగెస్ట్ రాజ్యసభ ఎంపీగా 39 ఏండ్ల బాక్సింగ్ చాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ ఉన్నారు. పెద్దల సభగా పిలిచే రాజ్యసభలో ఇప్పుడు యంగెస్ట్ ఎంపీగా రాఘవ్ నిలవబోతున్నారు. కాగా, ఇటీవల ఎన్నికలు జరిగిన పంజాబ్ లో 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 92 చోట్ల విజయంగా సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రం నుంచి ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు రావడంతో అక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ.. రాఘవ్ చద్దాతో పాటు మాజీ క్రికెట్ హర్బజన్ సింగ్, ప్రొఫెసర్ సందీప్ పాఠక్, ఎల్పీయూ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్, పారిశ్రామిక వేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది.

మరిన్ని వార్తల కోసం..

సీఎస్కే కెప్టెన్సీకి ధోని గుడ్ బై

తెలంగాణను బెంగాల్‎గా మార్చొద్దు

పెట్రో రేట్ల పెరుగుదల.. బీజేపీ ఆడుతున్న గేమ్