ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 25 కోట్ల ఆఫర్

ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 25 కోట్ల ఆఫర్

బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించి..పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రలోభాలకు తెరతీశారని మండిపడ్డారు. రెండ్రోజుల క్రితం ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కమలదళం బంపర్ ఆపర్ చేసిందని చెప్పారు. ఆప్ను వీడి కాషాయ కండువా కప్పుకుంటే అన్ని కేసులను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పిందని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు తనను సంప్రదించారని బీజేపీ బెదిరించి పార్టీలోకి జాయిన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారని కేజ్రీవాల్ తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ విషయాలపై చర్చిస్తామని ఢిల్లీ సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి,కుల్దీప్‌లను బీజేపీ నాయకులు సంప్రదించారని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి,రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ చెప్పారు. వారు పార్టీలో చేరితే ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ఇతర ఎమ్మెల్యేలను తమ వెంట తీసుకువస్తే రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆప్ నేతలపై సీబీఐ దాడులు కొనసాగుతాయన్నారు.