
గద్వాల, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు క్వాలిటీ వైద్యం అందించాలని ఆరోగ్య శ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం గద్వాల మెడికల్ కాలేజీ, వనపర్తి మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను కలెక్టర్లు సంతోష్, ఆదర్శ్ సురభితో కలిసి సందర్శించారు. మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, విద్యా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న సౌలతులను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రిలో అన్ని సౌలతులు ఉండేలా చూడాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వైద్య సేవలు అందించాలన్నారు.
వనపర్తి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల కొరత ఉందని, విద్యార్థులకు ట్రాన్స్పోర్టేషన్, కెడావర్ కొరత ఉందని కాలేజీ అధికారులు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆరోగ్యశ్రీ క్లెయిమ్ లపై ఆరా తీశారు. వనపర్తి జిల్లా మెడికల్ కో ఆర్డినేటర్ రమాదేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు, గద్వాలలో కమిటీ సభ్యులు రమాదేవి, ప్రిన్సిపాల్ నాగేశ్వర్, సూపరింటెండెంట్ ఇందిర పాల్గొన్నారు.