
- ఒకే సర్వే నంబర్లో లక్షల్లో వ్యత్యాసం
- కోట్లు పలికే చోట రూ.2 నుంచి రూ.3 లక్షలు పరిహారం
- హౌసింగ్ బోర్డ్‌లో ప్లాట్లకు గజం రూ.28,500, పక్కనే ఉన్న బైపాస్ బాధితులకు రూ.930
- రీ ఎంక్వైరీ చేపట్టాలని బాధితుల డిమాండ్
నల్గొండ, వెలుగు: నల్లొండ బైపాస్ రోడ్డు భూసేకరణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పరిహారం ఖరారులో అధికారులు, కొంత మంది నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, తమకు అనుకూలమైనవారికి ఎక్కువ, ఇతరులకు తక్కువ పరిహారం వచ్చేలా చక్రం తిప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. బైపాస్ కింద నల్గొండ శివారులోని ఎస్ఎల్బీసీ, కొత్తపల్లి, మర్రిగూడెం, అర్జాలబావి, గిరకబావి గూడెం, చర్లపల్లి, గుడ్లపల్లి గ్రామాల్లోని మొత్తం 3వేల కుటుంబాలు ఇండ్లు, ప్లాట్లు, 200 ఎకరాల దాకా భూములను కోల్పోతున్నారు.
ఇందులో పక్కపక్కనే ఉన్న ఇండ్లకు, ప్లాట్లకు, వ్యవసాయ భూములకు ఖరారు చేసిన పరిహారంలో భారీ వ్యత్యాసాలు ఉండడంతో నిర్వాసితుల ఆరోపణలకు బలం చేకూరుతోంది. దీంతో రీ ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న బాధితులు, తాజాగా ఆర్బిట్రేషన్‌లో అప్పీల్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఇంత వ్యత్యాసమా?
ఇటీవల హౌసింగ్ బోర్డ్‌లోని ప్లాట్లకు ప్రభుత్వం నిర్వహించిన వేలంపాటలో గజం ధర రూ.28,500 పలికింది. ప్రభుత్వానికి ఈ వేలం ద్వారా రూ.9 కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా ఈ సర్వే నంబర్‌ను ఆనుకుని ఉన్న మామిళ్లగూడెం బాధితులకు పరిహారం కింద కేవలం రూ.930 లెక్క కట్టారు. ఒకటే సర్వే నంబర్లో పక్కపక్కనే ఉన్న ప్లాట్లకు రూ.15 వేల అప్సెట్ ధర ఫిక్స్ చేసి, తమకు మాత్రం కేవలం రూ.930 లెక్కకట్టడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
14 కిలో మీటర్ల బైపాస్ రోడ్..
నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు పానగల్లులోని ఛాయ సోమేశ్వరాలయం నుంచి మర్రిగూడ మీదుగా నాగార్జున సాగర్ రోడ్డుకు కలిసేలా బైపాస్ ప్రతిపాదించారు. ఈ రోడ్డును నేషనల్ హైవే అథారిటీ చేపడుతోంది. పానగల్లు, ఆర్జాలబావి, మర్రిగూడెం, చర్లపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ, దేవరకొండ రోడ్ మీదుగా నాగార్జునసాగర్ హైవేకు కలుస్తుంది. భూసేకరణ కూడా కంప్లీట్ అయింది. పరిహారం విషయంలో భారీ తేడాలు ఉన్నాయంటూ బాధితులు మొదటి నుంచి ఆందోళనకు దిగుతున్నారు.
బేసిక్ వాల్యూతో సంబంధం లేకుండా..
ఒకే ప్రాజెక్టు కోసం భూములు సేకరించే క్రమంలో బేసిక్ వాల్యూతో సంబంధం లేకుండా నష్టపరిహారం అందరికీ సమానంగా చెల్లించాలి. కానీ, నల్గొండ బైపాస్ రోడ్ పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం అధికారులు భిన్నంగా వ్యవహరించారు. నష్టపరిహారం డిసైడ్ చేసేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో బేసిక్ వాల్యూను ప్రామాణికంగా తీసుకుంటుంది. భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసే కంటే మూడేండ్ల మందు నుంచి ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో పరిశీలిస్తుంది. ఈ మూడేళ్లలో ఏ ఏడాది ఎక్కువ ఉంటే దానినే పరిగణలోకి తీసుకుంటారు.
ఇవేమి పట్టించుకోకుండా రెవెన్యూ, ఇంజినీరింగ్ ఆఫీసర్లు పరిహారం ఖరారు చేయడంతో తాము నష్టపోతున్నామని బాధితులు వాపోతున్నారు. ఎస్ఎల్బీసీ, కొత్తపల్లి, మర్రిగూడెం, ఆర్జాలబావి, గిరకబావి గూడెం, చర్లపల్లి, గుడ్లపల్లి గ్రామాల్లో ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కలిపి 200 ఎకరాలు కోల్పోతున్నారు. మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న కొత్తపల్లి గ్రామం సర్వే నంబర్ 101,107లో వ్యవసాయ భూముల ధర ఎకరం రూ.2 నుంచి రూ.3 కోట్లు పలుకుతోంది. ఇళ్ల జాగలు, కమర్షియల్ ప్లాట్లుగజం రూ.20 వేల వరకు నడుస్తున్నాయి.
వీటిని అధికారులు అర్బన్ కింద కాకుండా రూరల్ ఏరియా కింద లెక్క కట్టడంతో పరిహారం తక్కువగా వచ్చింది. ఇళ్ల జాగలకు గజం రూ.2,800 చొప్పున కట్టిస్తే, వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.2.70 లక్షలే లెక్కకట్టారు. మర్రిగూడలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న భూమి ధర రూ.19 లక్షలే. కానీ, పానగల్లులో కొందరికి ఎకరం భూమికి రూ.90 లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించారు. ఇక కొన్ని చోట్ల రూ.19 లక్షలు బేసిక్ వాల్యూ ఉన్నప్పటికీ రూ.49 లక్షలు, కొందరికి రూ.50 లక్షలు చెల్లించారు.
పానగల్లులో పది గుంటల జాగ కోల్పోయినోళ్లకు కూడా రూ.కోటి పరిహారం చెల్లించారు. అదే పది గుంటల పక్కనే ఉన్న భూమికి మాత్రం కేవలం రూ.12 లక్షలే పరిహారం వచ్చిందని బాధితులు వాపోతున్నారు. ఇదిలాఉంటే పరిహారం చెల్లింపు విషయంలో నాలా కన్వర్షన్ ఉన్న భూములకు ఒక రేటు, నాలా కన్వర్షన్, డీటీసీపీ అప్రోవల్ లేని భూములుకు మరో రేటు ఫిక్స్ చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ, ఈ విషయంపై అవగాహన కల్పించకపోవడంతో చాలా మంది నష్టపోయారు.
ఆర్బిట్రేషన్‌లో అప్పీల్..
3జీ చట్టం ప్రకారం నష్టపరిహారంలో తేడాలు వచ్చినా, అన్యాయం జరిగినా అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఈ చట్టం కింద పరిహారం చెల్లింపుపై రీ ఎంక్వైరీ చేయాలని బాధితులు ఆర్బిట్రేషన్‌లో అప్పీల్ చేశారు.
రూ.2.70 లక్షల పరిహారమే ఇచ్చిన్రు..
మెడికల్ కాలేజీ ఎదురుగా 101సర్వే నంబర్ లో 33గుంటలు, 105లో 7 గుంటల భూమి ఉంది. మెడికల్ కాలేజీ వస్తుందని రూ.3లక్షలు ఖర్చు చేసి గత ఏడాది ఆగస్టులో నాలా కన్వర్షన్ చేయించిన. కోట్లు పలుకుతున్న ఆ భూమిని బైపాస్ కోసం తీసుకొని, రూ.2.70 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చారు. ఇదేంటని అడిగితే కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. నల్గొండకు 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లి గ్రామ పంచాయతీలోకి ఎలా వస్తుంది? మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించి న్యాయం చేయాలి.- మారయ్య గౌడ్, జనగాం
మార్కెట్ రేటు ప్రకారమే ఇచ్చాం..
నల్గొండ బైపాస్ కోసం సేకరించిన భూమికి మార్కెట్ రేట్ ప్రకారమే పరిహారం చెల్లించాం. నాలా కన్వర్షన్ కు అనుగుణంగా పరిహారం నిర్ణయించాం. కొన్ని భూములకు నాలా కన్వర్షన్ చేసుకున్నా యాక్టివిటీ లేకపోవడంతో పరిహారం తక్కువగా వచ్చింది.- అశోక్ రెడ్డి, ఆర్డీవో, నల్గొండ