
గద్వాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాలకు హాజరయ్యారు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ చెక్కులు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు గతేడాది రూ.26 కోట్ల రుణాలు మంజూరవగా ఈ ఏడాది రూ.72 లక్షల వడ్డీ మాఫీ చేసినట్లు పేర్కొన్నారు.
రూ.3 కోట్లతో ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రూ.15.80 కోట్ల ఎంటర్ప్రైజెస్ గ్రౌండింగ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మల్దకల్ మండలంలో 900 కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
స్టూడెంట్స్కు క్వాలిటీ ఫుడ్ అందించాలి
స్కూల్ స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా క్వాలిటీ ఫుడ్ అందించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం క్వాలిటీ, సైన్స్ ల్యాబ్ ను పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ప్రతీరోజు తరగతులకు హాజరై చదువుకుంటే జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటారని చెప్పారు. ఎంఈవో సురేశ్, కోఆర్డినేటర్ ఎస్తేరు రాణి, టీచర్లు పాల్గొన్నారు.