గుజరాత్ తొందరపడింది.. గిల్ కెప్టెన్సీపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్ తొందరపడింది.. గిల్ కెప్టెన్సీపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో గుజరాత్ ను సమర్ధవంతంగా నడిపిన హార్దిక్ పాండ్య ఈ సారి ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులో చేరడంతో గిల్ ను కెప్టెన్ గా ప్రమోట్ చేశారు. దీంతో ఈ యువ బ్యాటర్ 2024 ఐపీఎల్ సీజన్ లో కొత్త బాధ్యతలను స్వీకరించనున్నాడు. గిల్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై అందరూ నమ్మకముంచినా దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ గిల్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసాడు. 

డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. "విలియమ్సన్ లాంటి అనుభవజ్ఞుడు ఉండగా గిల్ కు కెప్టెన్సీ ఇవ్వడం అంత సరైనదిగా నేను భావించడం లేదు. గిల్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. కేన్ విలియంసన్ ను రిటైన్ చేసుకునే సరికీ అతనికి కెప్టెన్ ఇస్తారనుకున్నా. అన్ని ఫార్మాట్లలో నిలదొక్కుకోవడానికి గిల్ కు అవకాశం ఇవ్వండి. మరో ఐపీఎల్ సీజన్ తర్వాత గిల్ కు కెప్టెన్సీ ఇస్తే బాగుండేది. గిల్ బాగా కెప్టెన్సీ చేయాలని కోరుకుంటున్నాను" అని ఈ మాజీ దక్షిణాఫ్రికా విధ్వంసకర ప్లేయర్ తన మనసులోని మాట తెలియజేశాడు. 

2022 లో గుజరాత్ ఐపీఎల్ లో తొలిసారి పాండ్య సారధ్యంలో ఎంట్రీ ఇచ్చింది. తొలి సీజన్ లోనే టైటిల్ గెలవడంతో గిల్ కీలక పాత్ర పోషించగా.. ఈ ఏడాది ఐపీఎల్ ఫైనలిస్ట్ గా నిలిచింది. ఈ టోర్నీలో గిల్ అసాధారణ ఆటతీరుతో 890 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అన్నాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ సారథ్యంలో ఆడిన గిల్‌.. ఐపీఎల్‌లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు.