మట్టిలో కరిగే ప్లాస్టిక్

మట్టిలో కరిగే ప్లాస్టిక్

ప్లాస్టిక్​  వల్ల పర్యావరణానికే కాదు జంతువులు, పక్షులకు కూడా చాలా నష్టం జరుగుతోంది.  ఆ నష్టాన్ని పూడ్చడానికే సాఫ్ట్​వేర్​ ఉద్యోగాన్ని వదిలేసి ఊరిబాట పట్టాడు అభినవ్​ పటేల్​. భర్త ఆలోచనకి భార్య నందిని తోడు అయ్యింది.  ఇద్దరూ కలిసి  బయో క్యారీ బ్యాగ్స్​​ కంటే  ముందే కెమికల్​ ఫ్రీ నేచర్​ అనే ప్రయత్నం మొదలుపెట్టారు. 2015 లో హోలీ సందర్భంగా ఎకో కలర్స్​ తయారుచేశారు. కానీ,  ఏడాదికోసారి వచ్చే పండుగ అవడంతో ఆ రంగులకి మార్కెట్​లో పెద్దగా ఆదరణ దొరకలేదు. అయినా సరే  నిరుత్సాహపడలేదు. ప్రకృతిపై ప్రేమ వీళ్లని ‘ఎకో కవర్స్’​ వైపు నడిపించింది. కానీ, అటుగా వెళ్లడానికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. రీసెర్చ్​ కోసం ఏ ఇండస్ట్రీకి వెళ్లినా గేటు లోపలికి రానిచ్చేవాళ్లు కాదు. దాంతో ఎకో కవర్స్​ గురించి రీసెర్చ్ చేస్తున్న ఎక్స్​పర్ట్స్​ని కలిశారు. యూట్యూబ్​లో వాటి తయారీకి సంబంధించిన  వీడియోలు చూశారు. దాదాపు రెండేళ్లు రీసెర్చ్​ చేసి  2018లో ఇంట్లోనే  ఎకో కవర్స్​ తయారుచేశారు. అది సక్సెస్​ కావడంతో ఆర్గానిక్​ కవర్​ ప్లాంట్​ పెట్టాలి అనుకున్నారు.  కానీ, చేతిలో డబ్బు లేదు. 

తాకట్టు పెట్టి...

కవర్​ ప్లాంట్​ కోట్లతో కూడుకున్న పని. కానీ, అభినవ్, నందిని దగ్గర అంత డబ్బు లేదు. దాంతో లోన్​ కోసం బ్యాంకుల చుట్టూ  తిరిగారు. కానీ సాయం చేయడానికి ఏ బ్యాంక్​ ముందుకురాలేదు. అయినా వెనకడుగేయలేదు.  ప్లాస్టిక్​ ఫ్రీ నేచర్​ కోసం తన బంగారాన్ని తాకట్టు పెట్టింది నందిని. తన పేరు మీదున్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మేసింది. ఆస్తులు తాకట్టు పెట్టి దాదాపు 25 లక్షలు వడ్డీకి తీసుకుని భర్త ఆలోచనకి ప్రాణం పోసింది. జర్మనీ నుంచి మెషిన్​​ ఇంజిన్​​ తెప్పించి, ఖర్చు తగ్గించడానికి మిగతా పార్ట్స్​ అన్నింటినీ మన దగ్గర తయారుచేయించారు . 2021 ఫిబ్రవరిలో  నిజామాబాద్​ లక్కంపల్లి సెజ్​లో  గ్రీన్​ అలయెన్స్​ బయోటెక్​ ప్లాంట్​ని మొదలుపెట్టారు. 

ఎలా తయారుచేస్తారు?

గ్రీన్​ అలయెన్స్​లో రోజుకి 16 టన్నులు కవర్లు తయారుచేస్తున్నారు . అచ్చు ప్లాస్టిక్​ కవర్లని పోలి ఉన్న ఈ క్యారీ బ్యాగ్స్​ని కాకరకాయ, ఆస్ట్రేలియన్​ ఆలుగడ్డ, మొక్కజొన్న గంజి, సగ్గుబియ్యంతో తయారు చేస్తున్నారు. సెంట్రల్​ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​ ప్రకారం ఇవి భూమిలో 30 నుంచి 180 రోజుల్లో కరిగి ఎరువుగా మారతాయి.  వీటితో పాటు పాలిమర్​ కవర్లు కూడా ఉంటాయి. వివిధ సైజుల్లో, రకరకాల రంగుల్లో ఉంటాయి ఈ కవర్లు. 25 కిలోల బరువు మోసే కవర్లు కూడా అందుబాటులో ఉన్నాయి​. వేడిపదార్థాల కోసం  కూడా ప్రత్యేకంగా కవర్లు ఉన్నాయి. కవర్స్​తో పాటు  పెన్సిళ్లు, పెన్నులు,  వెదురు టూత్​ బ్రష్​లు కూడా తయారవుతున్నాయి ఇక్కడ. భవిష్యత్తులో బయో డీగ్రేడబుల్​ ప్లేట్లు,  స్పూన్స్​, గ్లాసులు  కూడా ఉత్పత్తి చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ ఇన్నొవేషన్​కి రీసెంట్​గా ‘వండర్​ బుక్​ ఆఫ్ ఇంటర్నేషనల్​ అవార్డు’  కూడా వచ్చింది. 

అందరం కలిసి

దేశవ్యాప్తంగా రోజుకి  పదివేల  టన్నుల ప్లాస్టిక్​ వాడుతున్నాం.ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఫ్యూచర్​లో భూమంతా ప్లాస్టిక్​తో నిండిపోతుంది. మన పిల్లలు హాయిగా గాలి పీల్చుకోలేని సిచ్యుయేషన్​ వస్తుంది. అందుకే ఇప్పటికైనా ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించాలి. ఆ ఆలోచనతో ఉద్యోగం వదిలేసి సొంతగూటికి వచ్చేశా. అన్ని అడ్డంకుల్ని దాటి నా భార్య​తో కలిసి ఈ బయో క్యారీ బ్యాగ్స్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చా. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడెక్కడ ప్లాస్టిక్​ వాడుతున్నారో వాటి స్థానంలో బయో ఉత్పత్తులు వాడేలా చేయడమే మా లక్ష్యం .అలాగే వీటి తయారీ గురించి.. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల గురించి యువతలో అవేర్​నెస్​ కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. 
- అభినవ్​ పటేల్​

 ::: నిజామాబాద్​,  వెలుగు