వన్డే సిరీస్ లో ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియాకు టీ20 ఫార్మాట్ లో అంత ఈజీ కాదు. టీమిండియా గత రెండేళ్లలో సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. సిరీస్ ఎక్కడ జరిగినా టీ20 ఫార్మాట్ లో మనోళ్లు దుమ్ములేపుతారు. అయితే ఆస్ట్రేలియా రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురు కానుంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (అక్టోబర్ 29) జరగనుంది. కాన్ బెర్రాలోని మనూక ఓవల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. ఈ సిరీస్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పైనే అందరి దృష్టి నెలకొంది.
అభిషేక్ శర్మ ప్రస్తుతం ఎంత ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలర్ ఎవరైనా ఎదురు దాడికి దిగుతూ పవర్ ప్లే లోనే మ్యాచ్ ను లాగేసుకుంటున్నాడు. ఇటీవలే ఆసియా కప్ లో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. రేపటి నుంచి ఆస్ట్రేలియాపై జరగనున్న టీ20 సిరీస్ లో చెలరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. అభిషేక్ శర్మ ఫామ్ చూసిన అభిషేక్ నాయర్ ఈ యువ ఓపెనర్ పై ప్రశంసలు కురిపించాడు. అభిషేక్ ఫామ్ లోకి వస్తే ఆసీస్ ఫాస్ట్ బౌలర్ హేజల్ వుడ్ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అయితే స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ తొలి రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడనున్నాడు.
నాయర్ మాట్లాడుతో ఇలా అన్నాడు.. "అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉంటే.. హాజిల్‌వుడ్ ఫామ్‌లో కోల్పోవడం ఖాయం. అతను బ్యాటింగ్ చేసే విధానం చూస్తే మొదటి బంతికే ఫోర్ లేదా సిక్స్ కొడతాడని మనకి తెలుసు. పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టిస్తూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. అభిషేక్ శర్మ ఆరు ఓవర్లు బ్యాటింగ్ చేస్తే ఇండియా 60 నుంచి 80 పరుగుల స్కోర్ చేస్తుంది. ఈ ప్రదర్శన అతని బ్యాటింగ్ భాగస్వామిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచుతుంది. ఆస్ట్రేలియాలో అతనికి కఠిన పరీక్ష. ముఖ్యంగా హేజిల్‌వుడ్‌ను ఎదుర్కోవడం ఛాలెంజింగ్ గా మారుతుంది. ఐపీఎల్, సౌతాఫ్రికాలో అదరగొట్టిన అభిషేక్ అలవోకగా ఆసీస్ బౌలర్ ను ఆడేస్తాడని భావిస్తున్నా". అని నాయర్ స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.
ఆసియా కప్‌లో తన పవర్‌హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ ర్యాంకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం (అక్టోబర్ 1) విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో అభిషేక్ 931 రేటింగ్ పాయింట్లు సాధించి, ఐసీసీ చరిత్రలోనే అత్యధిక పాయింట్లు అందుకున్న బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ఆసియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన అభిషేక్.. 2020లో డేవిడ్ మలాన్ (919 పాయింట్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఆసియా కప్ లో ఈ పంజాబీ స్టార్ 314 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. యావరేజ్ 44 కాగా.. స్ట్రైక్ రేట్ 200 కావడం విశేషం.
