
- అభిషేక్ రావుతో లావాదేవీలపై ఆరా
- సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరానూ ప్రశ్నించిన సీబీఐ
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. లిక్కర్ పాలసీకి ముందు జరిగిన మీటింగ్స్, హవాలా డబ్బు వివరాలను రాబడుతోంది. సీబీఐ నోటీసులు ఇవ్వడంతో జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ ఇంగ్లీష్ చానల్ ఎండీ బుధవారం విచారణకు హాజరయ్యారు. చానల్‌లో పెట్టుబడులు పెట్టినోళ్ల వివరాలు, అభిషేక్ రావు నుంచి వచ్చిన డబ్బుకు సంబంధించిన వివరాల గురించి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కస్టడీలో ఉన్న అభిషేక్ రావును వరుసగా రెండో రోజూ అధికారులు ప్రశ్నించారు. చానల్ ఎండీ అకౌంట్స్ నుంచి అభిషేక్ రావు అకౌంట్స్‌కు జరిగిన మనీ ట్రాన్సాక్షన్లపై ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే రాబిన్ డిస్టిలరీస్, డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీలు, అనూస్ బ్యూటీ పార్లర్, మాస్టర్ స్యాండ్ సహా మొత్తం 9 కంపెనీల లావాదేవీలను సీబీఐ పరిశీలించింది. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫీసులు ఉండాల్సిన ప్రాంతంలో ఇతర కార్యకలాపాలు నిర్వహించడంపై ప్రశ్నించినట్లు తెలిసింది. అభిషేక్ రావు నిర్వహిస్తున్న వ్యాపారాలు, పార్టనర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అభిషేక్ రావు అకౌంట్ల నుంచి జరిగిన మనీ ట్రాన్సక్షన్లను గుర్తించిన సీబీఐ.. ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు, అభిషేక్ రావు మధ్య జరిగిన లావాదేవీల వివరాలు రాబడుతోంది.
సిసోడియా సన్నిహితులపై ఫోకస్...
ఢిల్లీకి చెందిన బడ్డీ రిటైల్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ అమిత్ అరోరాను సీబీఐ అధికారులు బుధవారం విచారించారు. హర్యానాలోని గుర్గావ్ కు చెందిన అమిత్ అరోరా, ఢిల్లీకి చెందిన దినేశ్ అరోరా, అరుణ్ పాండేలు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితులని సీబీఐ గుర్తించింది. వీళ్లు తమకు ఉన్న పలుకుబడితో లిక్కర్ లైసెన్స్‌లు పొందినట్లు ఆధారాలు సేకరించింది. ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు అకౌంట్ నుంచి దినేశ్ అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్ యూసీఓ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించింది. ఇందులో భాగంగా సమీర్ మహేంద్రు, అభిషేక్‌రావు, అమిత్ అరోరాల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసింది. అభిషేక్‌రావు బ్యాంక్ అకౌంట్స్‌లో డిపాజిట్ అవుతున్న డబ్బు వివరాలను రాబడుతోంది.