పోడు పట్టాల పంపిణీలో విలేజ్​ ‘పాలిటిక్స్’​

పోడు పట్టాల పంపిణీలో విలేజ్​ ‘పాలిటిక్స్’​

అప్లికేషన్లు 41 వేలు.. హక్కు పత్రాలు 9,244 మందికి 

  •    పట్టాలు లేకున్నా భూములు వదలబోమని వార్నింగ్​
  •     కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తూ ఆఫీసర్ల డ్రామా

నిజామాబాద్​, వెలుగు : ఉమ్మడి జిల్లా నుంచి పోడు పట్టాల కోసం సుమారు 41 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. కాగా 9,244 మందికే పట్టాలు ఇచ్చారు.   పైరవీలకు ప్రయారిటీ ఇవ్వడంతో నష్టపోయామనే భావన జాబితాలో లేని వారిలో బలంగా ఉంది. అడ్డగోలు నిబంధనలతో మూడు వంతుల అప్లికేషన్లు పక్కన పెట్టడంతో విమర్శలు వస్తున్నాయి. హక్కు పత్రాలు ఇవ్వకపోయినా భూమిని మాత్రం వదలబోమని వార్నింగ్​ ఇస్తున్నారు.   

లిస్టు తయారీలో విలేజ్​పాలిటిక్స్ 

నిజామాబాద్​ జిల్లాలో 4,229 మందికి 8,611 ఎకరాల పోడు హక్కు పత్రాలు ఇవ్వడానికి లిస్ట్​తయారైంది.  కామారెడ్డిలో 5,015 మంది 11,387 ఎకరాల పోడుకు  హక్కుదారులయ్యారు.  పట్టాలు పొందలేకపోతున్న  గిరిజనులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. దరఖాస్తుల  పరిశీలనకు గ్రామ, మండల, డివిజన్​ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినా విలేజీ కమిటీ నిర్ణయాలు  ఫైనల్​ అయ్యాయి.  సర్పంచులు ముఖ్య  రోల్​ పోషించారు. ​ రాజకీయ పార్టీల ముద్రతో పాటు తమ వారు బెనిఫిట్​ పొందేలా చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.  నిజామాబాద్​ జిల్లాలోని వర్ని మండలం సయీద్​పూర్​ తాండావాసులు గ్రామ పంచాయతీకి తాళం వేసి పల్లె పాలకులపై నిరసన వ్యక్తం చేయడం ఈ విషయాన్ని బలపరుస్తోంది. స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గంలోని పంచాయతీకి గిరిజనులు లాక్​ వేయడం చర్చనీయాంశమైంది.  250 మంది పోడు హక్కుల కోసం దరఖాస్తు చేయగా 80 మంది అనుకూలురను సెలెక్ట్​ చేశారని నిందిస్తున్నారు. పొరుగు జిల్లాలోని మాచారెడ్డి మండలం మర్రితాండ, నెమ్లిగుట్ట తాండావాసులు గ్రామ కమిటీలపై గుర్రుగా ఉన్నారు. 

భూములు లాక్కుంటారని భయం

2005 డిసెంబర్​లోపు అటవీ భూమి సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కులు ఇస్తామనే  గవర్నమెంటు ప్రకటన మేరకు ఆఫీసర్లు తాజా ఎలిజిబుల్​ లిస్టు తయారు చేశారు.  అర్హత పొందలేని వారు గ్రామ రాజకీయాలకు తోడు  మూడు తరాల సాగు ఆధారాలు చూపాలనే మెలికతో  చిక్కులు ఎదుర్కొన్నారు.   ఫారెస్టు శాఖ ఉపయోగించిన గూగుల్​ కార్టోశాట్​ చిత్రాలు వారి సెలెక్షన్​కు అవరోధం అయ్యాయి.  ఇప్పడు ఎలిజిబుల్​ జాబితాలో లేని కారణంగా సాగు చేసుకుంటున్న ల్యాండ్​ నుంచి ఫారెస్టు ఆఫీసర్లు బయటకు పంపుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. 

ఆఫీసర్ల కొత్త ఎత్తు

 ఎలిజిబుల్​ జాబితాలో లేని వారి కోపాన్ని, నిరసనలు ఆపడానికి ఆఫీసర్లు కొత్త ఎత్తు వేశారు.  గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా మళ్లీ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. టెక్నికల్​ సమస్యతో ఎంపికకాలేదని అందుకు మరోసారి పేర్లు పరిశీలిస్తామని నమ్మిస్తున్నారు. సిరికొండలో మంగళవారం ఇలా అప్లికేషన్​లు తీసుకున్నారు. పట్టాలు పంపిణీలో బిజీ  నాగోరావు, జిల్లా ట్రైబల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ కొత్తగా ఎందుకు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మరో ఎలిజిబుల్​ లిస్టు తయారు చేస్తారా? అని జిల్లా ట్రైబల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ నాగోరావును ‘వెలుగు’ ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. పోడు పట్టాల పంపిణీ ప్రోగ్రామ్​ అరెంజ్​మెంట్లలో బిజీగా ఉన్నానని జారుకున్నారు.