టిక్ టాక్ వీడియోల్నిడిలిట్ చేస్తాం జాగ్రత్త

టిక్ టాక్ వీడియోల్నిడిలిట్ చేస్తాం జాగ్రత్త

టిక్‌‌టాక్‌‌లో చిన్న చిన్న వీడియోలు పెట్టి మన దేశంలో చాలా మంది యాక్టర్లు, డ్యాన్సర్లు, కమెడియన్ల అవతారం ఎత్తుతున్నారు. చైనాకు చెందిన ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్ టీనేజర్ల నుంచి ముసలోళ్ల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, మొదటి నుంచి టిక్‌‌టాక్‌‌ ఎంత ఫేమసో.. దాని చుట్టూ చుట్టుముట్టుకుంటున్న వివాదాలు, నిషేధాలు కూడా అంతే ఫేమస్! తాజాగా కంటెంట్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ ఉల్లంఘించినందుకు మన దేశంలో టిక్‌‌టాక్‌‌ 60 లక్షల వీడియోల్ని తొలగించింది. 

“షార్ట్‌‌ వీడియో షేరింగ్‌‌ యాప్‌‌ ‘టిక్‌‌టాక్‌‌’కి  కేవలం సిటీల్లోనే కాదు, ఊళ్లలోనూ ఉపయోగించేవాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. టిక్‌‌టాక్  డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మంది యూజర్లు ఉంటే, దాంట్లో మనదేశంలోనే 20 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. 2018లో ప్రపంచంలో ఎక్కువగా డౌన్‌‌లోడ్ చేసిన యాప్స్‌‌లో టిక్‌‌టాకే నంబర్‌‌‌‌ వన్‌‌. కానీ దానికి ఎంత పాపులారిటీ పెరుగుతూ వస్తోందో.. అదే రేంజ్‌‌లో గొడవలు చుట్టుముట్టాయి. అయితే, కంటెంట్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ పాటించనందుకు దేశవ్యాప్తంగా టిక్‌‌టాక్ తాజాగా 60 లక్షల వీడియోలను యాప్‌‌ నుంచి  తొలగించింది.

ఇలా జరిగింది

టిక్‌‌టాక్, హలో యాప్ లాంటి ప్లాట్‌‌ఫామ్స్‌‌ను దేశ వ్యతిరేక, అక్రమ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారని ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ అనుబంధ సంస్థ ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసింది. దాంతో కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ టిక్‌‌టాక్, హలో యాప్‌‌లకు వార్నింగ్‌‌ ఇస్తూ  పోయిన వారం నోటీసులు జారీ చేసింది. ఆరోపణలకు సంబంధించి జూలై 22 లోపు సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ.. 24 ప్రశ్నలు అడిగింది. అందులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు..

  •  ఈ ప్లాట్‌‌ఫామ్‌‌లు దేశవ్యతిరేక కార్యకలాపాలకు హబ్‌‌గా మారాయి’ అనే ఆరోపణలకు మీ సమాధానం ఏంటి?
  • ఫేక్‌‌ న్యూస్, భారత చట్టాల ప్రకారం వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
  • హలో, టిక్‌‌టాక్  ప్రజల ప్రైవసీ ప్రమాణాలను  పాటించాలనే ఆరోపణలు వస్తున్నాయి.18 ఏళ్లు దాటితేనే మేజర్లు. కానీ13 నుంచి 18 ఏళ్ల పిల్లలు కూడా ఉపయోగించేందుకు ఎందుకు అనుమతించారు?
  • గైడ్‌‌లైన్స్‌‌ని పాటించకుండా వేధింపులు, హేట్‌‌ స్పీచ్‌‌, న్యూడిటీ కంటెంట్‌‌ని ఎందుకు ప్రమోట్‌‌ చేస్తున్నారు?
  • యూజర్ల డేటాను విదేశాలకు, థర్ట్‌‌పార్టీలకు షేర్‌‌‌‌ చేయబోమని భరోసా ఇవ్వగలరా?

బ్యాన్ అవుతుందా?

టిక్‌‌టాక్, హలో యాప్‌‌లు ఆ ఇరవైనాలుగు ప్రశ్నలకు ఇంకా సమాధానం ఇవ్వలేదు. అయితే, టిక్‌‌టాక్‌‌ మాత్రం ఎందుకో  ఒక అడుగు ముందుకేసి కొన్ని వీడియోల్ని తొలగించింది. కేంద్రం అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబు ఇవ్వకుంటే ఈ రెండు యాప్‌‌లను బ్యాన్‌‌ చేసే అవకాశం లేకపోలేదు!