
కాకా వెంకటస్వామి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే సీనియర్ మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్. ఆయన బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి.. అంత పెద్దగా ఎదిగి, సమాజంలోని ఒడుదొడుకులను ఎదుర్కొని నిలబడటం అరుదైన విషయం. సంజీవయ్య, రాఘవులు, అంతకుముందు బీఎస్ వెంకట్‌రావు వంటి పెద్ద లీడర్లతో సమానంగా, అంత కష్టపడి, అంత సేవ చేసి, అంత పెద్ద పేరు తెచ్చుకున్నారు వెంకటస్వామి.
కెరీర్‌ను మలుచుకుని..
వెంకటస్వామిది చాలా హంబుల్ బిగినింగ్. పెద్ద ఫ్యామిలిలో పుట్టినవాడు కాదు. పెద్ద చదువులు లేకపోయినా, అపారమైన నాలెడ్జిని సంపాదించారు. సెల్ఫ్ మేడ్ లీడర్. వెంకటస్వామి ఎప్పుడు చూసినా ఒక ఇంగ్లిష్ పుస్తకం చేతిలో పట్టుకునేవారు. ముఖ్యంగా నవలలు, ఫిక్షన్స్ చదవడం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి అలవాట్ల వల్ల ఇంగ్లిష్‌పై పట్టు సాధించారు. ఇంగ్లిష్ చదువులు చదవకపోయినా, ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేసేవారు. ఇంగ్లిష్ పుస్తకాలు చదవడం, వార్తలు తెలుసుకోవడం, విశ్లేషణలు చేయడం, పెద్దవాళ్లతో కూర్చున్నప్పుడు సమస్యలను విశ్లేషించడం వల్ల ఆయన ఆలోచన మేధావులతో సమానంగా ఉండేది. అలా తనకు తానుగా లీడర్‌గా, మేధావిగా మారి.. కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నారు.
కొడుకులూ సక్సెస్..
వెంకటస్వామితో కలిసి పని చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఒకమాట చెప్పేవారు. ‘పిల్లల చదువు, బాగోగులు ఇప్పుడే బాగా చూసుకోవాలి’ అని అనేవారు. వెంకటస్వామికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్లిద్దరూ ప్రజా సేవ చేస్తున్నారు. వాళ్ల క్యారెక్టర్, వాళ్ల బిహేవియర్, సమాజంలో వారు నడుచుకుంటున్న తీరు అంతా వెంకటస్వామి నుంచి వచ్చిందే. ఇప్పుడు ఆయన కొడుకు వివేక్ సక్సెస్‌ఫుల్ మినిస్టర్. వివేక్ నాలెడ్జ్ ఉన్న లీడర్. ఆయన సక్సెస్‌కు పునాది వేసింది తండ్రి వెంకటస్వామినే.
గుడిసెలు వేయించి.. గూడు కల్పించి..
వెంకటస్వామిని గుడిసెల వెంకటస్వామి అంటారు. దానికి కారణం.. ట్రేడ్ యూనియన్‌లో ఉన్నప్పుడు పేదల కోసం ఆయన చేసిన పనే. ఉదాహరణకు అప్పట్లో అబిడ్స్‌లో తాజ్ మహల్ హోటల్ ఎదురుగా చాలా గుడిసెలు ఉండేవి. నిజాం పోయిన తర్వాత ఆ గుడిసెల కోసం కొట్లాడి, వాటిని తీయొద్దని వెంకటస్వామి ఉద్యమం ప్రారంభించారు. అప్పుడది చిన్నగా కనిపించింది. కానీ ఇప్పుడు వాళ్లు.. గొప్పవాళ్లలో, ధనికుల్లో ఒకరిగా ఉన్నారు. అలాగే నారాయణగూడలోనూ గుడిసెలు ఇప్పించారు. అలా చాలా ప్రాంతాల్లో పేదలకు ఇండ్లు ఇప్పిస్తూ వెళ్లారు. అప్పుడు అది చిన్న మ్యాటర్ అనుకున్నాం. కానీ, అలాంటి గుడిసెవాసులు ఈరోజు సమాజంలో గౌరవప్రదంగా బతికేలా చేశారు వెంకటస్వామి. ఆ ప్రాంతానికి చెందిన ఎంతో మంది ఈ రోజు జాతీయ స్థాయి క్రీడల్లో, ఉద్యోగాల్లో ఉండి విలువైన జీవితాన్ని సంపాదించారు.
బీసీ ఉద్యమాన్ని నడిపి..
1961లో నేను యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్‌గా, జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు సీఎం సంజీవయ్యను వెంకటస్వామి కలిపించారు. నన్ను చాలా దగ్గర చేసుకున్నారు. నేను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాకా.. వెంకటస్వామితో కలిసి బడుగు వర్గాల కోసం బీసీ ఉద్యమం నడిపాం. కొంతమంది మంత్రులతో కలిసి బడుగు వర్గాల కోసం మేం ఒక గ్రూప్‌గా ఏర్పడి, దానికి డెసిడెంట్ గ్రూప్ అని పేరు పెట్టాం. బీసీలకు 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశాం. డెసిడెంట్ గ్రూప్ ఉద్యమ ప్రభావంతో రాజీవ్ గాంధీ ఏఐసీసీ ఏపీ జనరల్ సెక్రటరీ ఎన్పీ సింగ్, కేఎల్ భగత్‌ను పిలిచి వాటాపై నిర్ణయం తీసుకున్నారు.
అప్పుడు దీనంతటికి వెంకటస్వామి లీడర్‌గా ఉన్నారు. డెసిడెంట్ ఉద్యమంతో 1978లో మిసెస్ పుల్లారెడ్డి సిటీ ప్రెసిడెంట్ ఉంటే.. ఆమెను తీసేసి, శివలింగం అనే వ్యక్తిని పెట్టారు. అలాగే నల్గొండలో పురుషోత్తం రెడ్డి అనే సీనియర్ లీడర్ తీసేసి బాలయ్యను పెట్టారు. ఇలా ఈ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాం. కాంగ్రెస్‌లోనే ఉండి కాంగ్రెస్‌తోనే పోరాడాం. అనంతరం ఇందిరా కాంగ్రెస్‌ను ప్రారంభించాం. అప్పుడు వెంకటస్వామి ఎంతో కష్టపడ్డారు. 1979లో ఢిల్లీలోని తన సొంత ఇల్లును ఏఐసీసీ ఆఫీసుకు ఇచ్చారు. దాని పక్కన సోనియాగాంధీ ఇల్లు ఉంది. ఇట్లా వెంకటస్వామి పార్టీ కోసం ఎంతో పని చేశారు.
1969 తెలంగాణ ఉద్యమం టైమ్‌లో ముషీరాబాద్‌లో పోరాటం జరిగింది. అప్పుడు వెంకటస్వామి పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ దౌర్జన్యం ఏంటని ప్రశ్నించి.. వెంటకస్వామి తెలంగాణ ఉద్యమ బాట పట్టారు. అప్పుడు మేం కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. రాష్ట్రం కోసం కొట్లాడేవాళ్లం. మాకు లీడర్‌గా వెంకటస్వామి ఉండే. ఏదైనా పెద్ద విషయం, పెద్ద వాళ్లతో మాట్లాడాలంటే.. వెంకటస్వామితో చెప్పేవాళ్లం. ఆయన అందరికన్నా వయస్సులో పెద్దవారు.
అయినా యంగ్ అండ్ యాక్టివ్‌గా ఉండేవారు. ఎంతదూరమైన నడిచేవారు. సుమారు ఈజీగా 6 మైళ్లు నడిచేవారు. హెల్త్‌ను కాపాడుకునేవారు. వెంకటస్వామి కొడుకు వివేక్ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ కోసం ముందున్న ఐదారుగురి నాయకుల పేర్లలో వివేక్ పేరు కూడా ఉంటుంది.
- కె.కేశవరావు,
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ