ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు

ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు

ఉస్మానియా యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ ఏబీవీపీ విద్యార్థులు  పరిపాలనా భవనం ముందు ధర్నా చేపట్టారు. యూనివర్సిటీ వీసీ రవీందర్ భూ ఆక్రమణ దారులతో కుమ్ముక్కయ్యారని వారు ఆరోపించారు. భూములకు రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ విభాగం కూడా వీసీ చెప్పినట్లే నడుడుకుంటున్నారని వారు తెలిపారు. ఓయూ భూముల జోలికొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. యూనివర్సిటీ విలువైన భూములను కాపాడాలని వారు రిజిస్టర్‌కు వినతి పత్రం అందించారు. 

మరోవైపు, ఇదే అంశంపై ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు బట్టు శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ భూమి 3500 ఎకరాలు ఉండేదని..  నేడు అది 1400 ఎకరాలకు రావడం సిగ్గుచేటు అని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉద్యమ పార్టీగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ.. నేడు ఓయూ భూములను లీజుల పేరుతో అక్రమార్కులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా.. ఓయూ నుండి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ నాయకులు మాట్లాడక పోవడం చాలా దురదృష్టకరమని వారు తెలిపారు. 

ఓయూ భూముల జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఓయూ జేఏసీ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత ఓయూ అధికారులపై, ప్రభుత్వంపై ఉందని వారు ప్రభుత్వానికి గుర్తుచేశారు.