
- ఆర్డీవోతో కలిసి విచారణ చేపట్టిన ఏసీబీ డీఎస్పీ
- రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తహసీల్దార్, సర్వేయర్ అరెస్ట్
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తహసీల్దార్ ఆఫీస్‌లో మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించి, లంచం తీసుకున్నట్లు అంగీకరించిన అధికారులను అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన అమ్మమ్మ పేరిట ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, పేర్లలో సవరణ కోసం ఆమనగల్లు తహసీల్దార్ చింతకింది లలితను సంప్రదించగా, రూ.50 వేలు డిమాండ్ చేసి గత నెల 29న లంచం తీసుకున్నారు.
అనంతరం మరో రూ.లక్ష లంచం ఇవ్వాలని తహసీల్దార్, సర్వేయర్ కోట రవి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆధారాలను సమర్పించాడు. మంగళవారం కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డితో కలిసి విచారణ చేపట్టగా, లంచం తీసుకున్నట్లు అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరుస్తామని చెప్పారు.
ఇంటి నంబర్ కోసం రూ.15 వేలు తీసుకుంటూ..
వికారాబాద్: ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన మునిసిపల్ అధికారిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 26లో ఓ షెడ్డు కట్టుకుంటున్నాడు. దీనికి ఇంటి నంబర్ కేటాయించాలని మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ బెజ్జ రమేశ్‌ను సంప్రదించాడు. దరఖాస్తు తీసుకున్న ఆయన రూ.15 వేలు డిమాండ్ చేశాడు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో రూ.15 వేలు ఇస్తుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.