
- మణుగూరులో సీఐని, జనగామ జిల్లాలో ఆర్‌ఐని, మేడ్చల్ జిల్లాలో డీఈఈని పట్టుకున్న ఏసీబీ
మణుగూరు, వెలుగు: ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ. లక్ష లంచం తీసుకున్న ఓ సీఐని ఏసీబీ ఆఫీసర్లు సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవల మణుగూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సీఐ సోమ సతీశ్‌కుమార్.. కేసులో ఇరికిస్తానంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న బేతంచెర్ల వెంకటేశ్వరరావు, కూరాకుల శ్రీనివాసరావును బెదిరించాడు.
రూ. 4 లక్షలు ఇస్తే కేసు నుంచి తప్పిస్తానని చెప్పడంతో వారిద్దరూ ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం రూ. లక్ష ఇస్తామని చెప్పడంతో టీవీ ఛానల్ రిపోర్టర్ మిట్టపల్లి గోపికి డబ్బులు ఇవ్వాలని సీఐ సూచించడంతో ఇతడికి ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు గోపిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. అతడితో పాటు సీఐ సతీశ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
రూ. 26 వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్‌ఐ
స్టేషన్‌ఘన్‌పూర్ (చిల్పూరు), వెలుగు: జనగామ జిల్లా చిల్పూర్ తహసీల్దార్ ఆఫీస్‌లో పనిచేసే ఆర్‌ఐ రూ. 26 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చిల్పూరు గ్రామానికి చెందిన ఆవుల బుచ్చయ్య గతంలో చనిపోవడంతో అతడి పేరున ఉన్న 1.23 ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులు రాజయ్య, లింగయ్య పంచుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి పాస్‌బుక్స్ జారీ చేయాలని చిల్పూరు ఆర్‌ఐ వినీత్‌కుమార్‌ను కలిశారు.
భూమిని పరిశీలించిన ఆర్‌ఐ పాస్‌బుక్స్ మంజూరు కోసం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రాజయ్య, లింగయ్య హన్మకొండ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో లింగయ్య సోమవారం ఆర్‌ఐ వినీత్‌కుమార్‌ను కలిసి రూ.26 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆర్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్‌ఐని అరెస్ట్ చేసి హనుమకొండలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన డీఈఈ , వర్క్ ఇన్‌స్పెక్టర్
కీసర,వెలుగు : మేడ్చల్‌జిల్లా నాగారం మున్సిపల్ డీఈఈ సుదర్శనం రఘు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు సురేశ్, రాకేశ్‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తాను చేసిన రోడ్డు పనులకు సంబంధించి రూ.11 లక్షల బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్ రమేశ్డీఈ రఘును కలవగా ఆయన 16 శాతం కమిషన్ డిమాండ్ చేశాడు. రూ.1.30 లక్షలు ఇస్తేనే పని అవుతుందని చెప్పడంతో రమేశ్రూ. లక్ష ఇస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత ఏసీబీని కలిశాడు.
వారి సూచనల మేరకు సోమవారం నాగారం మున్సిపాలిటీలో రమేశ్ రూ. లక్ష లంచం ఇస్తుండగా డీఈఈ సుదర్శనం రఘుతో పాటు ఆయనకు సహకరించిన ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు సురేశ్, రాకేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.