
ఫాంహౌస్ కేసులో సిట్ అధికారి గంగాధర్పై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల బెయిల్ షూరిటీలో స్థానికులనే పరిగణలోకి తీసుకోవాలని.. సిట్ మెమో ఇవ్వటంపై న్యాయమూర్తి మండిపడ్డారు. షూరిటీలపై డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరంటూ ప్రశ్నించారు. భేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే. కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించారు. దీంతో సిట్ అధికారి ఏసీపీ గంగాధర్ కోర్టుకు క్షమాపణ చెప్పారు. కోర్టు సీరియస్ అవడంతో మెమోను వెనక్కి తీసుకున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లపై జస్టిస్ చిల్లకూరు సుమలత విచారణ జరిపారు. ఒక్కొక్కరు రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని.. అంతే మొత్తానికి రెండు షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేశారు. పాస్‌పోర్టులను పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని.. ఇవ్వకుంటే వాటిని పోలీసులు సీజ్ చేయాలని సూచించారు. నిందితులు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది.సిట్ చార్జిషీట్ దాఖలు చేసేవరకు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల మధ్య సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని.. కేసు దర్యాప్తునకు సహకరించాలని సూచించింది. కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రలోభపెట్టకూడదని, బెదిరించకూడదని పేర్కొంది.