ఆ 30 లక్షలు ఎక్కడివి?..తహశీల్దార్ సుజాతపై బిగుస్తున్నఉచ్చు

ఆ 30 లక్షలు ఎక్కడివి?..తహశీల్దార్ సుజాతపై బిగుస్తున్నఉచ్చు
  •    బంజారాహిల్స్ ల్యాండ్ సెటిల్ మెంట్ కేసులో…
  •     తహసీల్దార్ సుజాత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
  •     సుజాత, ఆర్ఐ, ఎస్సై లపై కొనసాగుతున్న ఏసీబీ విచారణ 

హైదరాబాద్‌‌, వెలుగు: బంజారాహిల్స్‌‌ ల్యాండ్‌‌ సెటిల్‌‌మెంట్‌‌ కేసులో షేక్‌‌పేట్‌‌ తహసీల్దార్‌‌‌‌ సుజాత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.  రూ.40 కోట్ల ల్యాండ్‌‌ ఇష్యూలో రెవెన్యూ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ నాగార్జున రెడ్డి, వీఆర్‌‌‌‌ఓతో కలిసి తహసీల్దార్‌‌‌‌ సుజాత చక్రం తిప్పినట్లు ఏసీబీ గుర్తించింది. శనివారం అదుపులోకి తీసుకున్న ఆర్‌‌‌‌ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్‌‌ ఎస్సై రవీందర్‌‌ తో పాటు సుజాతను నాంపల్లి ఏసీబీ ఆఫీసులో విడివిడిగా విచారించారు. సుజాతను సుమారు7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ముగ్గురి స్టేట్‌‌మెంట్స్‌‌ రికార్డు చేసి ఆర్ఐ, ఎస్సై లను జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌‌కి తరలించారు. రూ.16.5. లక్షల క్యాష్‌‌ తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్‌‌‌‌ఐ, ఎస్సైలు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసులో ప్రమేయం ఉన్న వారి వివరాలను కాల్ డేటా ఆధారంగా పరిశీలిస్తున్నారు.

రూ. 30 లక్షలకు తేలని లెక్కలు

ఆదివారం జరిగిన విచారణలో బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్‌‌14లోని ప్రభుత్వ భూములు, బాధితుడి కోర్టు కేసుల వివరాలు సేకరించారు. దీంతోపాటు తహసీల్దార్‌‌‌‌ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ.30 లక్షలు, రూ 6 లక్షల బంగారు నగల లెక్కలు తేల్చుతున్నారు.పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడడంతో వాటి వివరాలపై సుజాతను ఆరా తీశారు. ఏసీబీ పట్టుకున్న డబ్బు తన జీతం డబ్బులని చెప్పడంతో దర్యాప్తు అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంత క్యాష్‌‌ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే బ్యాంక్‌‌ ట్రాన్సాక్షన్‌‌లో రూ.30 లక్షలకు డాక్యుమెంట్లు చూపించలేకపోయిందని సమాచారం. షేక్ పేట్ మండల పరిధిలోని మరికొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ గుర్తించింది. కాగా, రోడ్ నంబర్‌‌‌‌14లోని 4,865 చదరపు గజాల స్థలాన్ని సర్వే చేయాలని అప్లై చేయగా, తహసీల్దార్, ఆర్ఐ డీల్ మాట్లాడి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని బాధితుడు సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ చెప్పారు. రెండు కేసులు పెట్టారని, వాటిని ఎత్తేసేందుకు రూ. 3 లక్షలు అడిగారన్నారు.

సీఎం కేసీఆర్.. ఇప్పుడేమంటారు?: రాజాసింగ్

ఏ ఆఫీసరైనా సరే అవినీతికి పాల్పడితే తోలు తీస్తా, తోక కత్తిరిస్తా, జైలుకు పంపిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్, హైదరాబాద్ లో జరుగుతున్న భూకబ్జాలపై, రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియాపై ఏం చెప్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. బంజారాహిల్స్ లో ఆర్ఐ, ఎస్ఐలు ఏసీబీకి దొరికిన ఘటనపై సీఎం స్పందనేమిటో చెప్పాలన్నారు. సీఎం మాటలను ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేసిన ఒక వీడియోలో అన్నారు.