కదులుతున్న హెచ్ఎండీఏ డొంక..మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ రెయిడ్

కదులుతున్న హెచ్ఎండీఏ డొంక..మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ రెయిడ్
  • మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ రెయిడ్
  • ఏక కాలంలో 20  ప్రాంతాల్లో తనిఖీలు
  • ఆయన టీమ్ లో పనిచేసిన అధికారుల ఫోన్లు స్విచాఫ్​
  • ఇండ్లకు  పరుగులు తీసిన పలువురు ఆఫీసర్లు
  • కీలక పత్రాలను దాచేందుకు యత్నిస్తున్న వైనం
  • హైరైజ్ బిల్డింగులకు అడ్డగోలుగా పర్మిషన్లిచ్చిన బాలకృష్ణ
  • రూ. 500 కోట్లకుపైగా అవినీతి జరిగినట్టు ప్రాథమిక అంచనా

హైదరాబాద్: హెచ్ఎండీఏలో అవినీతి డొంక కదలుతోంది. బీఆర్ఎస్ హయాంలో డైరెక్టర్ గా పనిచేసిన బాలకృష్ణ ఇంటితోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి 20 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. బాలకృష్ణ ప్రస్తుతం మెట్రో రైట్ జీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. బాలకృష్ణ గతంలో ఎంఏయూడీలోనూ విధులు నిర్వర్తించారు. 

ఆయన హెచ్ఎండీఏ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో మణికొండ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో హైరైజ్ బిల్డింగులకు అనుమతులు ఇచ్చారు. ఈ సమయంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బాలకృష్ణ హవా బాగా నడిచిందని ఆఫీసు సిబ్బంది చెబుతున్నారు. ఆయనను ప్రసన్నం చేసుకుంటేనే పనులు జరిగేవని అంటున్నారు. ఆయన టీమ్ లో కొందరు టీపీవోలు పనిచేశారు. వారి ద్వారా అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకూ పర్మిషన్లు ఇవ్వడం కోసం నగదుతోపాటు భూములను కూడా రాయించుకున్నట్టు తెలుస్తోంది. 

ముఖ్యంగా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ లో అవినీతి జరిగిందని సమాచారం. ఆయన సంతకం లేకుంటే నాలా కన్వర్షన్స్, రెసిడెన్షియల్ ఏరియా నుంచి కమర్షియల్ గా మార్చడం సాధ్యం కాదని, ఇందుకోసం అవినీతికి పాల్పడినట్టు సమాచారం.  ఆ ఫైళ్లు, పేపర్లు బయటికి వస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన ప్రస్తుతం విధుల్లో ఉన్న కొందరు అధికారుల్లో నెలకొంది.  చాలా మంది టీపీవోలు ఆయనతో లావాదేవీలు జరిపారు.

బాలకృష్ణతో సత్సంబంధాలున్న ఎంఏయూడీ, హెచ్ఎండీఏ, సీడీఎంఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ అధికారులు ఫోన్లు స్విచాఫ్​ చేసుకొని ఇండ్లకు పరుగులు తీశారు. డాక్యుమెంట్లను దాచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు సాగించిన వారంతా భయంతో వణికి పోతున్నారు. 111 జీవోపై గత ప్రభుత్వం వేసిన కమిటీలో ఆయన కొనసాగుతున్నారు. 

మున్సిపల్ మంత్రి మెడకు చట్టుకుంటుందా?

బాలకృష్ణ అవినీతి బండారం బయటపడితే ఆ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా..? ఆయనపైనా విచారణ జరుగుతుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా భూ దందాలో కీలకంగా వ్యవహరించిన బాలకృష్ణ నివాసంపై ఏసీబీ దాడులు ఇటు హెచ్ఎండీఏ అటు ఎంఏయూడీలోని అధికారులను షేక్ చేస్తున్నాయి.