ఏపీలో అన్ని జిల్లాల్లో ఎమ్మార్వో ఆఫీసులపై ఏసీబీ దాడులు

ఏపీలో అన్ని జిల్లాల్లో ఎమ్మార్వో ఆఫీసులపై ఏసీబీ దాడులు

అమరావతి, వెలుగు: ఏపీలోని ఎమ్మార్వో ఆఫీసులపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) శుక్రవారం దాడులు  చేసింది. 13 జిల్లాల్లోని 21 రెవెన్యూ ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. రెవెన్యూ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 14400 కు వచ్చిన ఫిర్యాదులతో దాడులు చేసినట్లు ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మార్వో ఆఫీసుల్లో అనధికారికంగా ఉన్న రూ. 4 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలు మీసేవ ద్వారా చేసిన ఫిర్యాదులను పరిష్కరించకపోవడం, ఈ-–పాస్ బుక్ ల జారీ, స్పందన కార్యక్రమంలో ఇచ్చిన అర్జీలను పరిష్కరించకపోవడంపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రైతులకు ఇవ్వాల్సిన ఈ పాస్ బుక్ లను రెవెన్యూ సిబ్బంది తమ వద్దే ఉంచుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఎమ్మార్వోలు ప్రైవేటు వ్యక్తులతో రెవెన్యూ ఆఫీసుల్లో పనులు చేస్తున్నారని.. రాష్ర్ట వ్యాప్తంగా 200కుపైగా ఎమ్మార్వో ఆఫీసులపై తమకు ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మొదటి దశలో 21 ఆఫీసులపై దాడులు చేసినట్లు తెలిపారు. అక్రమ నగదు, రిజిస్టర్లు నిర్వహించని రెవెన్యూ సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లు డీజీ వెల్లడించారు. ఎమ్మార్వో ఆఫీసుల్లో తప్పనిసరిగా మెయింటేన్ చేయాల్సిన మ్యుటేషన్, రిజిస్టర్, ఆఫీస్ మూమెంట్ రిజిస్టర్ల నిర్వహించకపోవడంపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. 21 ఎమ్మార్వో ఆఫీసుల నుంచి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేయాలని డీజీ కోరారు.