డబుల్‌ బెడ్రూం ఇంటిని ఖాళీ చేయించేందుకు లంచం ..రూ. 50 వేలు తీసుకుంటూ ACBకి చిక్కిన ఎస్సై

డబుల్‌ బెడ్రూం ఇంటిని ఖాళీ చేయించేందుకు లంచం   ..రూ. 50 వేలు తీసుకుంటూ ACBకి  చిక్కిన ఎస్సై
  • మహిళకు కేటాయించిన డబుల్‌ ఇంటిని ఆక్రమించిన వ్యక్తులు
  • ఖాళీ చేయించి మహిళకు అప్పగించాలని హైకోర్టు ఉత్తర్వులు
  • పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఇచ్చేందుకు డబ్బులు అడిగిన సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై

ములుగు, వెలుగు : కోర్టు ఆర్డర్‌ ప్రకారం డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని ఆక్రమించిన వ్యక్తులను ఖాళీ చేయించి, లబ్ధిదారులకు హ్యాండోవర్‌ చేసేందుకు లంచం డిమాండ్‌ చేసిన ములుగు ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

మెదక్‌ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కేటాయించింది. అయితే ఆ ఇంటిని మరొకరు కబ్జా చేసి అందులో ఉంటున్నారు. దీంతో మహిళ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఇంటిని ఖాళీ చేయించి అసలు లబ్ధిదారుకు హ్యాండోవర్‌ చేయాలని హైకోర్టు స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు పోలీస్‌ ప్రొటెక్షన్‌ కావాలంటూ తహసీల్దార్‌ ములుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే.. అసలు లబ్ధిదారైన మహిళ తరఫున ఆమె బంధువు సైతం ములుగు ఎస్సై విజయ్‌కుమార్‌ను కలిసి డబుల్‌ ఇంటిని ఖాళీ చేయించాలని కోరారు. అయితే తన వద్ద సరిపడినంతా ఫోర్స్‌ లేదని చెబుతూ కొన్ని సార్లు తిప్పించుకున్నాడు. 

తర్వాత రూ.లక్ష ఇస్తే ఇంటిని ఖాళీ చేయిస్తానని చెప్పడంతో సదరు వ్యక్తి అంత ఇచ్చుకోలేమని చెప్పి రూ. 50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తర్వాత ఈ నెల 5న మహిళ బంధువు ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. 

వారి సూచన మేరకు మహిళ బంధువు రూ. 50 వేలు తీసుకొని మంగళవారం స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని కలువగా.. కానిస్టేబుల్‌ రాజుకు ఇవ్వాలని సూచించాడు. దీంతో బాధితులు కానిస్టేబుల్‌ను కలిసి డబ్బులు ఇచ్చారు. తర్వాత ఆ కానిస్టేబుల్‌ డబ్బులను ఎస్సైకి ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఎస్సై విజయ్‌కుమార్‌తో పాటు, కానిస్టేబుల్‌ రాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను సీజ్‌ చేసి, ఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.