వీడియో: విరాట్ కోహ్లీ వారసుడు.. దూకుడులో తనకు ఏమాత్రం తగ్గడు

వీడియో: విరాట్ కోహ్లీ వారసుడు.. దూకుడులో తనకు ఏమాత్రం తగ్గడు

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో అందరికీ విదితమే. ప్రతి మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకునే కోహ్లీ.. జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు వెనుకాడరు. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు మాటకు మాట ఇవ్వడంలోనూ.. బ్యాట్‌తో సమాధానం చెప్పడంలోనూ అతని రూటే సపరేటు. ఆలా అని కోహ్లీకి సహచర ఆటగాళ్ల పట్ల గౌరవం లేదనుకోకండి. తనకి గౌరవం ఇచ్చే వారి పట్ల అంతే గౌరవంగా ఉంటారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించే వారికి అంతే దురుసుగా సమాధానమిస్తారు. 

అయితే వయసు మీద పడతుండటంతో కోహ్లీ.. మరో నాలుగైదు ఏళ్లకంటే ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగించకపోవచ్చు. ఈ తరుణంలో అతని తరువాత వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారా! అన్న ప్రశ్న అందరిలోనూ ఉండేది. ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. వారసుడు దొరికేశాడు. అతని పేరే. హర్షిత్ రాణా. భారత యువ క్రికెటర్. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు ధీటుగా బదులివ్వడంలో కోహ్లీకి ఏమాత్రం తగ్గడం లేదు.

బంగ్లా క్రికెటర్‌కు బుద్ధిచెప్పిన హర్షిత్ రాణా

ఎసీసీ ఎమర్జింగ్‌ ఆసియాకప్‌ 2023లో భాగంగా శుక్రవారం భారత్ ఏ, బంగ్లాదేశ్‌ ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాట‌ర్ సౌమ్య సర్కార్.. క్యాచ్ ఔట్‌గా అవుటయ్యాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్ర‌మంలో సౌమ్య సర్కార్‌కు.. హర్షిత్ రాణాకు మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగడంతో.. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు క‌లుగ‌ చేసుకోవాల్సి వచ్చింది.

లెక్క సరిపోయింది.. 

హర్షిత్‌ రానా ఇంత దురుసుగా రియాక్ట్‌ అవ్వడానికి ఒక బలమైన కారణమే ఉంది. టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో యష్‌దుల్‌ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్‌ కాస్త శ్రుతి మించి సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్‌ రానా.. అతను ఔటవ్వగానే  బదులు తీర్చుకున్నాడు. 'నువ్వు మొదలుపెట్టావ్‌..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది' అంటూ అతను కామెంట్‌ చేయడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో భారత యువ జట్టు 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఏను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటవ్వగా.. అనంతరం లక్ష్యఛేదనకే  దిగిన బంగ్లా 34.2 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. ఇక ఆదివారం కొలంబో వేదికగా  భారత్‌ - పాకిస్థాన్‌ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది.