ఏపీలో యాక్సెంచర్ క్యాంపస్.. ఉద్యోగుల సంఖ్యను.. 12 వేలకు పెంచుకోవడమే టార్గెట్

ఏపీలో యాక్సెంచర్ క్యాంపస్.. ఉద్యోగుల సంఖ్యను.. 12 వేలకు పెంచుకోవడమే టార్గెట్

న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీ యాక్సెంచర్ ఆంధ్రప్రదేశ్​లో కొత్త క్యాంపస్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీని ద్వారా భారతదేశంలో ఉద్యోగుల సంఖ్యను సుమారు 12 వేలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని రాయిటర్స్‌‌‌‌ వార్తాసంస్థ తెలిపింది. విశాఖపట్నం పోర్ట్ సిటీలో సుమారు 10 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వాలని యాక్సెంచర్ కోరింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం లభిస్తుందని సంబంధిత అధికారి రాయిటర్స్‌‌‌‌కు తెలిపారు. ఈ క్యాంపస్ కోసం యాక్సెంచర్ ఎంత పెట్టుబడి పెడుతుందనే విషయం తెలియలేదు.

ఎకరం భూమిని రూ.0.99కు లీజుకు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఇతర ఐటీ సంస్థలు కూడా ఉపయోగించుకున్నాయి.  ఇవి విశాఖపట్నంలో సుమారు 20 వేల ఉద్యోగాలను సృష్టించే క్యాంపస్‌‌‌‌ల కోసం భూమిని పొందాయి. కాగ్నిజెంట్ 183 మిలియన్ డాలర్లు, టీసీఎస్ 154 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఈ ప్రాజెక్ట్‌‌‌‌ల కోసం కేటాయించాయి. టెక్ సంస్థలు తక్కువ ఖర్చుల కారణంగా టైర్-2 నగరాలకు విస్తరిస్తున్నాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.