ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైన్స్లకు దరఖాస్తుల వెల్లువ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైన్స్లకు దరఖాస్తుల వెల్లువ
  • ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ 
  • చివరి రోజు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆశావహులు
  • ఉమ్మడి జిల్లాలోని 192 వైన్స్​లకు 3772 అప్లికేషన్లు
  • ప్రభుత్వానికి రూ.113.16 కోట్ల ఆదాయం
  • ఈనెల 23న డ్రా ద్వారా షాపుల కేటాయింపు

ఆదిలాబాద్/మంచిర్యాల, వెలుగు: మద్యం దుకాణాల కేటాయింపుకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. చివరి రోజు దరఖాస్తులదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో రాత్రి వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 23న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తారు. ప్రస్తుతమున్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబర్ 30న ముగియనుండగా.. ఇప్పుడు టెండర్లు దక్కించుకున్న వ్యాపారులకు 2027 నవంబర్ 30 వరకు గడువు ఉంటుంది. 

జిల్లాల వారీగా దరఖాస్తులు ఇలా..

మంచిర్యాల జిల్లాలోని 73 వైన్ షాపులకు ఏకంగా1,544 అప్లికేషన్లు వచ్చాయి. మంచిర్యాల సర్కిల్ పరిధిలో 717, బెల్లంపల్లిలో 382, చెన్నూరులో 211, లక్సెట్టిపేట సర్కిల్ పరిధిలో 254 అప్లికేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం వరకు 654 అప్లికేషన్లు రాగా.. చివరి రోజైన శనివారం 890 అప్లికేషన్లు వచ్చాయి. 1,544 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.46.32 కోట్ల ఆదాయం వచ్చింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 47 వైన్స్​లకు గాను 915 అప్లికేషన్స్ వచ్చాయి.

 నిన్నటివరకు 306 అప్లికేషన్స్ రాగా ఈ రోజే 609 అప్లికేషన్స్ రావడం విశేషం. దీంతో ప్రభుత్వానికి 27.45 కోట్లు సమకూరాయి. ఆదిలాబాద్​ జిల్లాలో 40 మద్యం దుకాణాలు ఉండగా మొత్తం దరఖాస్తులు 711 దరఖాస్తులు వచ్చాయి. దీంతో రూ. 21.33 కోట్లు సమకూరాయి. చివరి రోజు ఏకంగా 320 దరఖాస్తులు సమర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 32 వైన్స్ షాపు గాను 602 దరఖాస్తులు వచ్చాయి. ఆశావహులు చివరిరోజు 222 దరఖాస్తులు అందజేశారు. రూ.18.06 కోట్ల ఆదాయం సమకూరింది.

ఆదాయం తెచ్చే వైన్స్​లపైపే మొగ్గు

అధిక ఆదాయం తెచ్చే మద్యం దుకాణాల వైపే వ్యాపారులు మొగ్గు చూపారు. పట్టణ ప్రాంతంలోని షాపులతో పాటు మండల కేంద్రాల్లోని దుకాణాలకు దక్కించుకునేందుకు పోటీపడి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తు ఫీజు ఎక్కువగా ఉండటంతో ఆశావహులు గ్రూపుగా ఏర్పడి దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో తిరిగి ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి దుకాణాలకు లక్కీ డ్రా పూర్తయ్యి డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. ఈసారి మద్యం దుకాణాలు దక్కించుకున్న వారికి ఎన్నికల కిక్కు ఉండనుంది.