బెదిరింపు కాల్స్ పై గచ్చిబౌలి పీఎస్ లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫిర్యాదు

బెదిరింపు కాల్స్ పై గచ్చిబౌలి పీఎస్ లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫిర్యాదు

హైదరాబాద్ : అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నెంబర్స్ నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని హిల్ రీడ్జ్ విల్లాస్ లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాసం ఉంటున్నారు.

అంతకుముందు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫాంహౌజ్  కేసు తర్వాత గుర్తు తెలియని  నెంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మాదాపూర్  ఏసీబీకి  ఫిర్యాదు చేశారు. 

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అనంతరం నలుగురు ఎమ్మెల్యేల జాడ ఇంకా తెలియడం లేదు. గత నెల 26 రాత్రి ప్రగతిభవన్కు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు వెళ్లారు. ఆ తర్వాత ఉప ఎన్నిక ముందు అక్టోబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మునుగోడు సభకు వెళ్లారు. అక్కడ వేదికపై సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు కనిపించారు. ఆ సభ ముగిసిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వెంట ప్రగతిభవన్ కు వెళ్లారు.

ఆ తర్వాత ప్రగతిభవన్ లో ఈనెల 3వ తేదీన కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కనిపించారు. ఇక ఆ తర్వాత నుంచి నలుగురు ఎమ్మెల్యేల జాడ కనిపించడం లేదు. మరోవైపు ఈనెల 4వ తేదీన నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ నుంచి ఎర్రవల్లి ఫాంహౌస్ కు తరలించారని వార్తలొస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేలను ఎందుకు అజ్ఞాతంలో ఉంచారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు ఎస్కార్ట్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నలుగురు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర కూడా భద్రత పెంచింది. అయితే తాజాగా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలుస్తోంది. 

వేగంగా సిట్ దర్యాప్తు

మరోవైపు ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసును సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఆడియో రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.