అది యాక్సిడెంట్ కాదు.. ఊహించని హత్య కుట్ర : భయంకరమైన నిజాన్ని బయటపెట్టిన డాష్ క్యామ్ విజువల్స్

అది యాక్సిడెంట్ కాదు.. ఊహించని హత్య కుట్ర : భయంకరమైన నిజాన్ని బయటపెట్టిన డాష్ క్యామ్ విజువల్స్

బెంగళూరులో జరిగిన యాక్సిడెంట్.. యాక్సిడెంట్ కాదు.. అది పక్కా హత్య అని తేల్చారు పోలీసులు. జరిగిన తీరు చూస్తే అది యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటారు.. అలాగే ఉంది కూడా సీన్.. అసలు నిజం మాత్రం వేరు. కారు డ్యాష్ బోర్డుకు ఉన్న కెమెరాలో విజువల్స్ చూసిన తర్వాత.. పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇది యాక్సిడెంట్ కాదు.. ఫ్రెండ్ ను చంపటానికి తన కారును.. తానే యాక్సిడెంట్ చేసి.. ఫ్రెండ్ ను చంపాడని నిర్థారించారు పోలీసులు. అన్ బిలీవబుల్.. అస్సలు కలలో కూడా ఇలా ఊహించలేని విధంగా స్కెచ్ వేసి మరీ జరిగిన హత్య కుట్ర.. డ్యాష్ బోర్డు కెమెరా విజువల్స్ తో బయటపడింది. ఈ మర్డర్ మిస్టరీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.....

ఆదివారం సాయంత్రం అనంతనగర్ రోడ్డులో ఒక కారు ప్రమాదం జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. అయితే, డీసీపీ ఎం. నారాయణ ఆ కారులోని డాష్‌క్యామ్ (Dashcam) ఫుటేజీని చూశాక అసలు నిజం బయటపడింది. స్నేహితుడైన ప్రశాంత్ (33)ని చంపాలనే ఉద్దేశంతోనే రోషన్ హెగ్డే (36) కారును వేగంగా పోనిచ్చి గోడకు, చెట్టుకు ఢీకొట్టినట్లు తెలిసింది.

పోలీసుల విచారణలో తెలిసిన వివరాల ప్రకారం శనివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ విషయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. ఆదివారం సాయంత్రం అందరూ కలిసి క్రికెట్ ఆడి, ఆ తర్వాత మద్యం సేవించారు. ఆ సమయంలో లైటర్ విషయంలో మళ్ళీ గొడవ మొదలైంది. ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు. గొడవ పెరగడంతో రోషన్ తన టాటా సఫారీ కారు ఎక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు.

రోషన్ కారు స్టార్ట్ చేయగానే, ప్రశాంత్ కారు డోర్ పక్కన ఉండే ఫుట్‌బోర్డ్‌పైకి ఎక్కి డోర్ విండో పట్టుకుని వేలాడాడు. రోషన్ మొదట కారును తక్కువ  వేగంతో నడిపాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి రాగానే కారు స్పీడ్  ఒక్కసారిగా పెంచి, ప్రశాంత్ ఉన్న వైపు భాగాన్ని బలంగా ఒక కాంపౌండ్ గోడకు ఢీకొట్టాడు. మళ్ళీ కారును రివర్స్ చేసి మరీ ఒక చెట్టుకు ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో ప్రశాంత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ గొడవ అంతా కారులోని డాష్‌క్యామ్‌లో రికార్డ్ అయ్యింది. ఆ రికార్డింగ్‌లో ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవడం, బెదిరించుకోవడం కూడా వినిపించాయి. ఈ ప్రమాదంలో నిందితుడు రోషన్‌కు కూడా గాయాలయ్యాయి. అతని నాలుక తెగిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు. సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వగానే, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు.