కెమికల్ డ్రమ్ములు పేలి మంటలు.. ముగ్గురు మృతి

కెమికల్ డ్రమ్ములు పేలి మంటలు..  ముగ్గురు మృతి
  • మృతుల్లో ఇద్దరు కార్మికులు, అసిస్టెంట్ మేనేజర్ 
  • వీళ్లు బెంగాల్, బీహార్, శ్రీకాకుళం వాసులు 

జిన్నారం, వెలుగు: ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు పేలి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియాలోని మైలాన్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 11:45 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీ ఈటీపీ ప్లాంట్ లో కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కెమికల్ డ్రమ్ములపై వేడి నీళ్లు పడడంతో అవి ఒక్కసారిగా పేలిపోయాయి.దీంతో మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకొని పశ్చిమ బెంగాల్ కు చెందిన సంతోష్ మెహర (40), బీహార్ కు చెందిన రంజిత్ కుమార్ (27) అనే కార్మికులు..  శ్రీకాకుళానికి చెందిన అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వరరావు (38) తీవ్రంగా గాయపడ్డారు. 90 శాతం కాలిన గాయాలు కాగా, వారిని అంబులెన్స్ లో తరలిస్తుండగా తొవ్వలోనే చనిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫ్యాక్టరీ వద్దకు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. జిన్నారం సీఐ సురేందర్ రెడ్డి స్పాట్ కు వచ్చి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, డెడ్ బాడీలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచామని ఆయన తెలిపారు. మేనేజ్ మెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

ఫైర్ సేఫ్టీ పరికరాల్లేవ్.. 

ఫ్యాక్టరీలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని కార్మికులు చెప్పారు. అందువల్లే మంటల్లో చిక్కుకున్నోళ్లను రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన టైమ్​లో ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్... మీడియాను లోపలికి అనుమతించలేదు.