రోడ్డు యాక్సిడెంట్​ బాధితులకు స్పీడ్​గా క్లెయిమ్​ సెటిల్​మెంట్

రోడ్డు యాక్సిడెంట్​ బాధితులకు స్పీడ్​గా క్లెయిమ్​ సెటిల్​మెంట్

వెలుగు బిజినెస్​ డెస్క్​: రోడ్డు​ యాక్సిడెంట్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​లను మూడు నెలల్లోనే పరిష్కరించేలా చొరవ తీసుకుంటున్నారు. కేంద్ర రోడ్ల మంత్రిత్వ శాఖ, ఇన్సూరెన్స్​ కంపెనీలు, రాష్ట్రాల పోలీస్​ డిపార్ట్​మెంట్​లు కలిసి ఒక ప్లాన్​ను ఇందుకోసం తేనున్నాయి. మన దేశంలో రోడ్లపై యాక్సిడెంట్ల పాలయిన వారికి ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ అందడానికి సగటున అయిదేళ్లు పడుతోందని, దీనిని ఇప్పుడు మూడు నెలలకి తగ్గించేలా చొరవ తీసుకుంటున్నారని సీనియర్​ అధికారులు వెల్లడించారు. కొన్ని కేసులు 20 ఏళ్లుగా కోర్టులలో నడుస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రత్యేక పోర్టల్​, ఫార్ములా...

సుప్రీం కోర్టు, మోటార్​ యాక్సిడెంట్​ క్లెయిమ్స్​ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ)​, హైకోర్టులు క్లెయిమ్​లు తొందరగా సెటిలయ్యే విధంగా ఒక ఫార్ములాను డెవలప్​ చేస్తున్నాయని ఆ అధికారులు చెప్పారు. దీంతో యాక్సిడెంట్​కు గురయిన బాధితులు లేదా వారి కుటుంబాలకు వెంటనే రిలీఫ్​ దొరుకుతుందని పేర్కొన్నారు. యాక్సిడెంటల్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​లో లిటిగేషన్​ తగ్గించాలనేదే ఈ మార్పు లక్ష్యం. ఇందుకోసం ఇన్సూరెన్స్​ కంపెనీల నుంచి బాధితులు క్లెయిమ్​లు పొందే ప్రక్రియనూ సులభం చేయనున్నారు. రోడ్​ యాక్సిడెంట్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​లను వేగంగా పరిష్కరించడం కోసం జనరల్​ ఇన్సూరెన్స్​ కౌన్సిల్​ (జీఐసీ) ఒక వెబ్​సైట్​ను డెవలప్​ చేస్తోంది. జరిగిన యాక్సిడెంట్లను ఎప్పటికప్పుడు  ఈ వెబ్​సైట్లో రియల్ టైములో అప్​లోడ్​ చేయనున్నారు. పోలీసులు లేదా బాధితులు (వారి కుటుంబం) యాక్సిడెంట్​ గురించి ఈ పోర్టల్​కు తెలియచేయాల్సి ఉంటుంది. 24 గంటలూ పనిచేసే ఇన్సూరెన్స్​ కంపెనీ ఫోన్​ నెంబర్​కు కూడా ఫోన్​ చేసి యాక్సిడెంట్​ వివరాలు తెలియచేయాలి.

ఎంఏసీటీ ఈమెయిల్​ అప్లికేషన్లు తీసుకోవాలి...​

యాక్సిడెంట్​ రిపోర్టును జరిగిన 48 గంటలలోపు  ఎలక్ట్రానిక్​  రిపోర్టు రూపంలో ​ జీఐసీ, ఎంఏసీటీలకు తెలియ చేయాలని పోలీసులను సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 15 న ఆదేశించింది. యాక్సిడెంట్​ ఏ కారణం వల్ల జరిగిందనే వివరాలు ఆ రిపోర్టులో ఉండాలని పేర్కొంది. ఈ నిబంధనను అందరూ పాటించాలని సుప్రీం కోర్టు సూచించగా, ఇన్సూరెన్స్​ కంపెనీలు అంగీకరించాయి. నెల రోజుల లోపు పోలీసులు యాక్సిడెంట్​పై డిటెయిల్డ్​ రిపోర్టును సబ్మిట్​ చేయాలి. అప్లికేషన్లను, రిపోర్టులను ఎంఏసీటీ ఈమెయిల్​ రూపంలో తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది. ఆ తర్వాత ఈమెయిల్స్​ ద్వారానే సమన్లను పంపి, వీడియో కాన్ఫరెన్సింగ్​ ఎంఏసీటీ హియరింగ్​ (విచారణ) నిర్వహించాలి.  నెల రోజులలోపే ఈ విచారణను ఎంఏసీటీ పూర్తి చేయాలి. అనంతరం ఇన్సూరెన్స్​ కంపెనీ క్లెయిమ్​ డబ్బును బాధితులు లేదా వారి కుటుంబాలకు ఎలక్ట్రానికల్​గా పంపాల్సి ఉంటుందని పై సీనియర్​ అధికారులు పేర్కొన్నారు. కాంపెన్సేషన్​ ఎంతనేది నిర్ణయించడానికి స్పెసిఫిక్​ ఫార్ములా కూడా డెవలప్​ చేస్తున్నారని వెల్లడించారు.

ఏటా 5 లక్షల యాక్సిడెంట్లు..

దేశంలో ఏటా 5 లక్షల మోటార్​ యాక్సిడెంట్​ క్లెయిమ్స్​ రిపోర్టవుతుంటే, అందులో 1.5 లక్షల కేసులో బాధితులు మరణిస్తున్నారు. మిగిలిన కేసులలో బాధితులు తీవ్రమైన గాయాలపాలవుతున్నారని అధికారులు చెప్పారు. యాక్సిడెంట్​ బాధితులకు ఇన్సూరెన్స్​ పాలసీ లేకపోయినా వెహికల్​ ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి కాంపెన్సేషన్​ పొందొచ్చనే విషయం దేశంలో చాలా మందికి తెలియనే తెలియదని కూడా ఆ అధికారులు పేర్కొన్నారు.

రూ.12 వేల కోట్ల క్లెయిమ్స్​..

దేశంలో ప్రతీ ఏడాది కనీసం రూ. 10 నుంచి రూ. 12 వేల కోట్ల విలువైన రోడ్​ యాక్సిడెంట్​ క్లెయిమ్స్​ వస్తున్నాయి. ఇందులో సగటున రూ. 5 వేల కోట్ల విలువైన క్లెయిమ్స్​ను ఇన్సూరెన్స్​ కంపెనీలు చెల్లిస్తున్నాయి. మిగిలిన క్లెయిమ్స్​ ఏదో ఒక రకమైన వివాదంతో కోర్టులలో ఏళ్ల తరబడి నలుగుతున్నాయి.   ఫలితంగా యాక్సిడెంట్​ బాధితులు లేదా వారి కుటుంబాలకు ఇబ్బందులెదురవుతున్నాయని సీనియర్​ అధికారులు పేర్కొన్నారు. రోడ్​ యాక్సిడెంట్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్స్​ నిజానికి నెల రోజులలోపు సెటిలవ్వాలి. కానీ, ప్రస్తుతం 5 నుంచి 10 ఏళ్లు కూడా పడుతోంది. బాధితులకు లేదా వారి కుటుంబాలకు అంగీకారమైన  సెటిల్​మెంట్​ తొందరగా చేయాల్సిన అవసరం వుందని ఆ అధికారులు వివరించారు.