వధువును తీసుకెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి

వధువును తీసుకెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి

మరికొన్ని గంటల్లో పెళ్లి.. మండపానికి పెళ్లికూతురును ఆటోలో తీసుకొని దగ్గరి బంధువులు బయలుదేరారు. కాసేపట్లో మండపానికి చేరుకుంటారనగా.. ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలొదిలారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో జరిగింది.

త్రిపురాంతకం మండలం సోమేపల్లికి చెందిన యువతికి పొదిలిలోని అక్కచెరువుకు చెందిన యువకుడితో ఆగష్టు 25న ఉదయం 11 గంటలకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. వధువును బుధవారం ఉదయం అక్కచెరువులోని పెళ్లి మండపానికి ఆటోలో తీసుకొని దగ్గరి బంధువులు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కలుజువ్వలపాడుకు చేరకోగానే.. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి నలుగురు జారిపడ్డారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులను కనకం కార్తీక్, అనిల్, సుబ్బారావు, శ్రీనుగా గుర్తించారు. 

కాగా.. ప్రమాదసమయంలో పెళ్లికూతురు ఆటోలో ముందుభాగంలో కూర్చొవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గాయపడ్డవారిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో పెద్దలు పెళ్లిని వాయిదా వేశారు.