మంచిర్యాల, వెలుగు: నిజామాబాద్ నుంచి జగ్దల్పూర్ నేషనల్ హైవే 63 విస్తరణకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు భూసేకరణ సర్వేను అడ్డుకుంటున్నారు. ఊర్లకు నష్టం లేకుండా గతంలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రోడ్డుకు రెండు వైపులా భూసేకరణ చేయాలని, మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో సర్వం కోల్పోయామని, వచ్చిన కొద్దిపాటి పరిహారంతో పాటు అప్పులు చేసి మెయిన్ రోడ్డు పక్కన ఇండ్లు కట్టుకుంటే... ఇప్పుడు ఫోర్‌లేన్ పేరుతో మరోసారి రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి ముల్కల్ల గ్రామ శివారులో టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ పోయి బ్రౌన్‌ఫీల్డ్ వచ్చే..
ఎన్‌హెచ్ 63 నిజామాబాద్ నుంచి జగ్దల్పూర్ వరకు విస్తరించి ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు నుంచి మహారాష్ట్ర సరిహద్దు అర్జునగుట్ట వరకు హైవే నిర్మిస్తుండగా, ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 2018లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు ప్రతిపాదించారు. మధ్యలో ఉన్న టౌన్లు, గ్రామాల్లోని కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా పూర్తిగా వ్యవసాయ భూముల మీదుగా దీనిని నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన అలైన్మెంట్ సైతం పూర్తయింది. గ్రీన్‌ఫీల్డ్ హైవేతో మంచిర్యాల, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలతో పాటు పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు నష్టం కలుగుతుండడంతో బడా రియల్టర్లు, లీడర్లు రంగంలోకి దిగి దానిని రద్దు చేయించారనే ప్రచారం ఉంది.
పట్టణాలు, పల్లెల మీదుగా బ్రౌన్‌ఫీల్డ్
గ్రీన్‌ఫీల్డ్ హైవే క్యాన్సల్ కావడంతో ప్రస్తుతం ఉన్న రోడ్డునే ఫోర్‌లేన్‌గా విస్తరించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 28న రిలీజ్ చేసింది. అధికారులు భూసేకరణ సర్వే స్టార్ట్ చేశారు. మంచిర్యాల, హాజీపూర్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో బిల్డింగులు రోడ్డులో పోనున్నాయి. దొనబండ, హాజీపూర్, రాపల్లి, గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి తదితర గ్రామాలతో పాటు మంచిర్యాల శివారు భూములకు నష్టం కలుగనుంది. పైగా అధికారులు ప్రస్తుతం ఉన్న రోడ్డుకు రెండు వైపుల కాకుండా ఒకవైపు మాత్రమే భూసేకరణ సర్వే చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్, ఫైబర్ నెట్ కేబుల్స్‌కు నష్టం లేకుండా ఒకవైపు భూములను సేకరిస్తున్నామని ఎన్హెచ్ఏ అధికారులు చెప్తున్న కారణాలు సమంజసంగా లేవని ప్రజలు మండిపడుతున్నారు.
నాడు ఎల్లంపల్లితో... నేడు రోడ్డు విస్తరణతో..
పదిహేనేండ్ల కిందట ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లోని తొమ్మిది గ్రామాలు మునిగిపోయాయి. ప్రభుత్వం ఎకరానికి రూ.2లక్షల నష్టపరిహారం చెల్లించింది. హైవే పక్కన ఆర్అండ్ఆర్ కాలనీలను ఏర్పాటుచేసి భూనిర్వాసితులకు ప్లాట్లు కేటాయించింది. వారికి వచ్చిన అరకొర పరిహారం పైసలతో రోడ్డు పక్కన బిల్డింగులు కట్టుకున్నారు. కొంతమంది జాగలు కొనుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో రోడ్డు పక్కన మార్కెట్ వ్యాల్యూ గజానికి రూ.10వేల పైనే పలుకుతోంది. గవర్నమెంట్ రేటు రూ.వెయ్యి లోపే ఉంది. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించినా మార్కెట్ రేటులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణతో తమను మరోసారి రోడ్డున పడేస్తున్నారని వాపోతున్నారు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు..
బ్రౌన్ ఫీల్డ్ హైవే స్వరూపం..
ఆర్మూర్ నుంచి క్యాతన్‌పల్లి వరకు మొత్తం 131 కిలోమీటర్లు ఫోర్‌లేన్ నిర్మించనున్నారు. రూ.2,581 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నిజామాబాద్ జిల్లాలో 35.9 కిలోమీటర్లు, జగిత్యాల జిల్లాలో 69.3, మంచిర్యాల జిల్లాలో 35.8 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ముల్కల్ల నుంచి వేంపల్లి, తిమ్మాపూర్ గ్రామపంచాయతీలు, మంచిర్యాల, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల మీదుగా కుర్మపల్లి వద్ద ఎన్‌హెచ్ 363కి లింక్ చేయనున్నారు. ఇప్పటికే అలైన్మెంట్ పూర్తికాగా డీపీఆర్ తయారు చేస్తున్నారు. భూసేకరణ, బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, కరెంట్ లైన్ల మార్పులు, తొలగించాల్సిన చెట్లు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్, కమర్షియల్ ల్యాండ్, బిల్డింగులు, జనావాసాలు, చెరువులు, కుంటలు, ఇరిగేషన్ కెనాల్స్ విషయాలపై రిపోర్టు రెడీ చేస్తున్నారు.