రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తే ఇండియాకు లక్ష కోట్ల భారం: SBI రిపోర్ట్

రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తే ఇండియాకు లక్ష కోట్ల భారం: SBI రిపోర్ట్

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేయాలని ఇండియాపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. రష్యా నుంచి దిగుమతులను ఆపకుంటే డబల్ టారిఫ్ లు తప్పవని.. అదనంగా 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు.  ఇండియా ఇంపోర్ట్స్ ఆపకుంటే ఆగస్టు 27 నుంచి టారిఫ్ లు అమలవుతాయని హెచ్చరించారు. ఈ తరుణంలో ఒకవేళ  రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను నిలిపివేస్తే ఇండియాకు ఎంత నష్టం వాటిల్లనుందో SBI రిపోర్ట్ విడుదల చేసింది. 

రష్యా నుంచి దిగుమతి ఆపి ఆమెరికా తదితర దేశాలతో ఆయిల్ కొనుగోలు చేస్తే భారత్ దాదాపు  రూ. 80 వేల కోట్లు (9 బిలియన్ డాలర్లు) ఆర్థిక భారం పడనుందని రిపోర్టులో పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలోనే ఇంతటి నష్టం వాటిల్లనుందని వెల్లడించింది. అదే విధంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి లక్షా నాలుగు వేల కోట్ల (12 బిలియన్ డాలర్లు) భారం పడనుందని పేర్కొంది. 

రష్యా నుంచి భారత్ భారీ డిస్కౌంట్ లో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే రష్యా నుంచి కొనటం ఆపేసి తమతో కొనాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అందుకోసం టారిఫ్ లను ఉపయోగించుకుంటున్నాడు. అంత డిస్కౌంట్ ను కాదని యూఎస్ తో ఆయిల్ కొంటే ఇండియాకు భారీ నష్టం తప్పదు. 

►ALSO READ | అవును.. ట్రంపే ఇండియా-పాక్ వార్ ఆపారు: అదే పాత పాట పాడిన మార్కో రూబియో

రష్యా నుంచి భారత్ 2022 నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యాపై వెస్ట్రన్ కంట్రీస్ సాంక్షన్స్ విధించాయి. అంటే యూరోప్, యూఎస్ తదితర దేశాలు రష్యా ఆయిల్ కొనుగోలుపై నిషేధం విధించాయి. దీంతో తక్కువ ధరకే ఆయిల్ అమ్ముతామని ఇండియకు ఆఫర్ చేసింది రష్యా. అప్పటి నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ ను రష్యానుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తోంది. 2020 లో రష్యా నుంచి కొంటున్న ఆయిల్ 1.7 శాతం ఉండగా.. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 35.1 శాతానికి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 2025 లో ఇండియా దిగుమతి చేసుకునే 245 మిలియన్ మెట్రిక్ ఆయిల్ లో.. రష్యా నుంచే 88 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ లో రష్యా 10 శాతం ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ అన్ని దేశాలు రష్యా నుంచి కొనుగోలును ఆపేస్తే.. ధరలు 10 శాతం మేరకు పెరగనున్నట్లు ఎస్బీఐ రిపోర్ట్ అంచనా వేసింది. ఇది ఇండియాకే కాదు.. ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అయితే ఇండియా కేవలం రష్యాపైనే ఆధారపడకుండా.. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏయీ తదితర మరో 40 దేశాల నుంచి ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకుంటుంది.