
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆచూకీపై సంచలన విషయం బయటపడింది. శుక్రవారం సాయంత్రమే అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. శని, ఆదివారాల్లో రాజధాని కొలంబోలోనే ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని పార్లమెంట్ స్పీకర్ ధ్రువీకరించారు. సోమవారం దాకా గోటబయ దేశంలోనే ఉన్నారని, తర్వాత దగ్గర్లోని ఓ దేశానికి వెళ్లిపోయారని చెప్పారు. బుధవారం (13న) రాజీనామా చేసేందుకు ఆయన వస్తారని తెలిపారు. అయితే గోటబయ ఆచూకీపై అధ్యక్ష కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎయిర్‌బేస్ నుంచి ఆయన దుబాయికి వెళ్లినట్లు స్థానిక మీడియా తెలిపింది.
15న పార్లమెంట్ సమావేశం?
గోటబయ చెప్పినట్లు ఈ నెల 13న రాజీనామా చేస్తే.. 20న కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకోనున్నట్లు మంత్రి ప్రసన్న చెప్పారు. పార్లమెంటు ఈ నెల 15న సమావేశం కానుందని స్థానిక మీడియా తెలిపింది. 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పేర్కొంది. మరోవైపు ప్రెసిడెంట్ నివాసం, సెక్రటేరియట్ నిరసనకారుల ముట్టడిలోనే ఉన్నాయి. వాటిలోకి వేలాది మంది వెళ్లి వస్తున్నారు. గోటబయ రాజపక్స ప్రభుత్వం దిగిపోయే దాకా ఆందోళనలు కొనసాగుతాయని నిరసనకారులు తేల్చిచెప్పారు.