సిద్దిపేట లో లీడర్ల ఆరోపణలు.. ప్రత్యారోపణలు

సిద్దిపేట లో లీడర్ల ఆరోపణలు.. ప్రత్యారోపణలు
  • కోవర్టులకే పదవులనే వ్యాఖ్యాలతో కలకలం.. 
  • వేడెక్కుతున్న ‘హస్తం’ అంతర్గత రాజకీయాలు

సిద్దిపేట, వెలుగు : ఎన్నికల ఏడాదిలో కలిసికట్టుగా పనిచేయాల్సిన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో గ్రూపుల లొల్లి పెరిగి గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక సమస్యను ఎదుర్కొంటుంటే జిల్లా పార్టీలో మరొక సమస్య ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందోనని కింది స్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. 

నిప్పురాజేసిన ‘కోవర్టు’ ఆరోపణలు.. 

ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేత దామోదర రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో కోవర్టులకే పదవులు ఇచ్చారనే ఆరోపణలు పార్టీలో నిప్పు రాజేసినట్టయింది. దీంతో ఎక్కడికక్కడ నియోజకవర్గ నేతల అనుచరుల ఆరోపణలు.. ప్రత్యారోపణలకు దిగడంతో  కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీ.నర్సారెడ్డిని పీసీసీ మరోసారి నియమించడమే కాకుండా, దుబ్బాకకు చెందిన పన్యాల  శ్రవణ్​ కుమార్ రెడ్డిని పీసీసీ ఉపాధ్యక్షుడిగా, సిద్దిపేటకు చెందిన పూజల  హరికృష్ణను ప్రధాన కార్యదర్శిగా నియమించింది.  కాగా పూజల హరికృష్ణ దామోదర అనుచరుడిగా పార్టీ వర్గాలు పేర్కొనగా, మిగిలిన ఇద్దరిలో ఎవరిపై దామోదర ఆరోపణలు సంధించి ఉంటారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. గత మూడేండ్లుగా డీసీసీ అధ్యక్షడిగా నర్సారెడ్డి పనిచేస్తుండగా, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా శ్రవణ్​ కుమార్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో పదవులు పొందిన వారిని ఉద్దేశించి కోవర్టు కామెంట్లు చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అనుచరులు వర్గల్, గజ్వేల్, జగదేవ్ పూర్ లలో ప్రెస్ మీట్లు పెట్టి కోవర్టు కామెంట్ల ను ఖండించారు. కాగా దామోదర అనుచరుడు  సిద్దిపేటకు చెందిన మీసం నాగరాజు ఏకంగా ప్రెస్ మీట్​లోనే  నర్సారెడ్డి కోవర్టేనని, పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం గమనార్హం.  ఆ తర్వాత దుబ్బాకలో శ్రవణ్​కుమార్ రెడ్డి అనుచరులు దామోదర ఇతర నియోజకవర్గాలపై పెత్తనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. డీసీసీ కార్యదర్శి ఏలూరి కరుణాకర్, చెరుకు శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కోవర్టులుగా మారడంతోనే ఐటీ కంపెనీ వచ్చిందని ప్రత్యారోపణలు చేశారు. కోవర్టు ఆరోపణలపై ఆయా నేతల అనుచరులు మరికొంత మంది మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

ఇష్యూ.. హైకమాండ్​ దృష్టికి..

కోవర్టులకే పదవులు దక్కాయనే ఆరోపణలను డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి  పార్టీ హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కొందరికి పార్టీ పదవులు రానందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్య నేతలే ఇలాంటి వ్యాఖ్యాలు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని వివరించినట్టు సమాచారం. 

మూడు చోట్ల ఇదే తీరు.. 

సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో గ్రూపుల గోల మొదలైంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతల మధ్య సయోధ్య కొరవడటంతో ఒకిరిపై ఒకరు పై చేయి సాధించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత  దర్పల్లి చంద్రంపై పార్టీ ముఖ్య నేతల అనుచరులే  పీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాస్​రెడ్డి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా అప్పుడప్పుడు  శ్రవణ్​ కుమార్ రెడ్డి మద్దతుదారులతో విభేదాలు వస్తున్నాయి. గతంలో ఒక వర్గంపై మరో వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లింది. అయితే శ్రవణ్​ కుమార్ రెడ్డికి పీసీసీ పదవి దక్కడంతో రానున్న రోజుల్లో  గ్రూపుల గోల పెద్దదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గజ్వేల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి మరో నేత జశ్వంత్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇటీవల పార్టీ కార్యక్రమాలను రెండు గ్రూపులు వేర్వేరుగా నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి.