ఢిల్లీలో కాలేజీ అమ్మాయిపై యాసిడ్ దాడి

ఢిల్లీలో కాలేజీ అమ్మాయిపై యాసిడ్ దాడి

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్​లో దారుణం 

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఇంటి నుంచి నడుచుకుంటూ స్కూల్​కు వెళ్తున్న బాలిక(17)పై యాసిడ్​తో దాడి చేశారు. తీవ్రగాయాలైన ఆమె ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతోంది. ఈ ఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏరియాలో బుధవారం జరిగింది. అక్కడి సీసీ కెమెరాల్లో జరిగిందంతా రికార్డయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధిత బాలిక తన చెల్లి(13)తో కలిసి ఉదయం స్కూల్​కు బయల్దేరింది. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చారు. ఆ అమ్మాయిల దగ్గరికి వచ్చాక బైక్ ను కొంచెం స్లో చేయగా, వెనుక కూర్చున్న వ్యక్తి బాలికపై యాసిడ్ పోసి పరారయ్యారు. యాసిడ్  పెద్దమ్మాయి ముఖంపై పడడంతో పరుగులు పెట్టింది. స్థానికులు ఆమెను సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ముఖంపై 8 శాతం కాలిన గాయాలయ్యాయని, ఆమె కండ్లపైనా ఎఫెక్ట్ పడిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూ ట్రీట్ మెంట్ అందిస్తున్నామని, కండిషన్ స్టేబుల్ గా ఉందని తెలిపారు. 12వ తరగతి చదువుతున్న తన బిడ్డ ముఖంపై, కండ్లలో యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయని బాలిక తండ్రి చెప్పారు. ‘‘నా బిడ్డలు ఇద్దరూ స్టేషన్​ వరకు నడుచుకుంటూ వెళ్లి మెట్రోలో స్కూల్ కు వెళ్తారు. తనకు ఇబ్బంది ఉందని గానీ, ఎవరైనా వేధిస్తున్నారని గానీ పెద్దమ్మాయి చెప్పలేదు” అని తెలిపారు. అలాంటి గొడవలేమీ లేవన్నారు. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. ‘‘ఈ ఘటన ఉదయం 7:30 గంటలకు జరిగింది. 9 గంటలకు మాకు సమాచారం అందింది. బాలిక నిందితుల పేర్లు చెప్పింది. ప్రధాన నిందితుడు సచిన్ అరోరా, అతని ఇద్దరి స్నేహితులు హర్షిత్(19), వీరేందర్(22)​ను అరెస్టు చేశాం” అని డీసీపీ హర్షవర్ధన్ చెప్పారు. నిందితులు యాసిడ్​ను ఆన్​లైన్​లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కాగా, నిందితులకు అమ్మాయికి పరిచయం ఉందని, సెప్టెంబర్​లో వీళ్ల మధ్య గొడవ కావడంతోనే నిందితులు దాడికి పాల్పడినట్లు తెలిసింది.

నిందితులను కఠినంగా శిక్షిస్తం: కేజ్రీవాల్ 

నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ‘‘ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. నిందితులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్లను కఠినంగా శిక్షిస్తాం. ఢిల్లీలోని ప్రతి బాలిక సేఫ్టీ మాకు ముఖ్యమే” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి ఘోరాలు జరగకుండా యాసిడ్ పై నిషేధం విధించాలని మేం ఎప్పటి నుంచో పోరాడుతున్నం. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు ఇంకెప్పుడు మేల్కొంటాయి?” అని ఆమె ప్రశ్నించారు.