మిల్లర్లకు అండగా ఉంటున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి : ​ రాచాల యుగంధర్​ గౌడ్

 మిల్లర్లకు అండగా ఉంటున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి : ​ రాచాల యుగంధర్​ గౌడ్

వనపర్తి, వెలుగు: మంత్రి జూపల్లి కృష్ణారావు వడ్ల కొనుగోలుపై అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​ను బేఖాతర్​ చేసిన మిల్లర్లకు అండగా ఉంటున్న సివిల్  సప్లయ్  అధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్  జేఏసీ రాష్ట్ర చైర్మన్​ రాచాల యుగంధర్​గౌడ్​ డిమాండ్​ చేశారు. సోమవారం కలెక్టర్​ను కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్  సమీక్ష చేసిన తర్వాత కూడా మిల్లర్లు రైతులను తరుగు పేరుతో మోసం చేస్తున్నారని తెలిపారు.

వారికి సివిల్  సప్లయ్  అధికారులు అండగా ఉండడంతోనే ఈ పరిస్థితి ఉందన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వాల్సిన ట్రక్  షీట్  ఇవ్వకుండా రైస్  మిల్లు దగ్గర ఇస్తున్నారని, ఇలాంటి చర్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్, బీసీ పొలిటికల్  జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్, ఉపాధ్యక్షుడు రేనట్ల మల్లేశ్, అంజన్న యాదవ్, ధర్మేంద్ర సాగర్, రమేశ్, రవి నాయుడు పాల్గొన్నారు.

లారీలు బయట తిరిగితే చర్యలు

రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను మిల్లులు, గోదామ్​లకు  తరలించేందుకు ట్రాన్స్​పోర్ట్​  సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లను కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్  వెంకటేశ్వర్లుతో కలిసి రైస్​మిల్​ అసోసియేషన్​ సభ్యులు, ట్రాన్స్​పోర్టు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీలను అందుబాటులో ఉంచాలని, లారీల సంఖ్యను పెంచాలని సూచించారు.  

వడ్లను తరలించే లారీలు బయట తిరిగితే చర్యలు తీసుకోవాలని డీటీవోను ఆదేశించారు. మిల్లుల వద్ద వడ్లు ఒక రోజుకు మించి ఆపవద్దని, వడ్ల బస్తాలు దించుకోవడానికి కావాల్సిన హమాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సివిల్​ సప్లయ్​ డీఎం జగన్మోహన్, డీఏవో గోవింద్​నాయక్  పాల్గొన్నారు.