ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు వసూలు చేస్తే చర్యలు ..మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు వసూలు చేస్తే చర్యలు ..మంత్రి జూపల్లి కృష్ణారావు
  • సమస్యలేమైనా ఉంటే డైరెక్ట్‌‌గా నాకు కాల్‌‌ చేయండి 

ఆదిలాబాద్‌‌/బోథ్, (ఇంద్రవెల్లి) వెలుగు : ‘ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.. ఇది ప్రజాపాలన.. ఎవరికి ఇబ్బందులు కలిగించొద్దు.. పేదల ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. గురువారం ఆదిలాబాద్‌‌ జిల్లాలో పర్యటించిన ఆయన.. బోథ్‌‌ నియోజకవర్గ కేంద్రంలో మోడల్‌‌ ఇందిరమ్మ ఇండ్లను, గురుకుల పాఠశాలలో డార్మెట్రీ బిల్డింగ్‌‌ను ప్రారంభించారు. అనంతరం స్థానిక ఫంక్షన్‌‌హాల్‌‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌ చెక్కులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ... పదేండ్లు రేషన్‌‌ కార్డులు ఇవ్వకపోవడంతో పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజా సమస్యలను పెండింగ్‌‌లో పెట్టొద్దని, దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇండ్లను మంజూరు చేశామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డైరెక్ట్‌‌గా తన నంబర్‌‌ 98480 14089 కు ఫోన్‌‌ చేయాలని సూచించారు. 

అనంతరం జైనథ్‌‌ మండలంలోని పిప్పర్‌‌వాడ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన దంపతులకు బట్టలు పెట్టారు. తర్వాత ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద అమరవీరుల స్మృతివనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భగా ఎనిమిది మంది అమరవీరుల కుటుంబాలకు ట్రైకార్‌‌ ద్వారా మంజూరైన ట్రాక్టర్లను అందజేశారు. 

అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌ యార్డులో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు అనిల్‌‌ జాదవ్‌‌, పాయల్‌‌ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీబీ చైర్మన్‌‌ అడ్డి బోజారెడ్డి, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ శ్యామలాదేవి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్‌‌ కలెక్టర్‌‌ యువరాజ్ మర్మాట్‌‌ పాల్గొన్నారు.