బీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో : తెలంగాణ ఉద్యమకారులు

బీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో  : తెలంగాణ ఉద్యమకారులు

హనుమకొండ: ‘బీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో అందరం ముందుకుపోవాల్సిన అవసరముందని తెలంగాణ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 'ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి ఎంత?' అంశంపై నక్కలగుట్టలోని హరిత హోటల్ లో ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ ’వరంగల్ లో రాజకీయ చైతన్యాన్ని నిర్వీర్యం చేయడంలో కేసీఆర్ సఫలమయ్యారు. కుటుంబ పాలనలో ఎమ్మెల్యేలు కాళ్లపై పడి టికెట్లు తెచ్చుకుంటున్నారు. 

తెలంగాణ వచ్చిన 10 ఏండ్లలో వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ లాంటి జిల్లాలు అభివృద్ధికి పూర్తిగా దూరమయ్యాయి. పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ అభివృద్ధిని పట్టించుకోవట్లేదు. కుటుంబ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బలవుతున్నారు. కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి’ అని కూరపాటి సూచించారు.

దోపిడీదారుల చేతిలో బందీ 

 తెలంగాణ ఉద్యమకారిణి  రహీమున్నీసా బేగం మాట్లాడుతూ ‘మా పాలన మాకు కావాలని ప్రాణాలు ఫణంగా పెట్టి ఉద్యమం చేసినం. బంగారు తెలంగాణను లూటీ చేసి.. తాగుబోతుల తెలంగాణగా మార్చారు. 
ఉచిత పథకాలు వద్దు.. పనిచేసుకొని బతికే పరిస్థితులు కావాలి. తెలంగాణ వచ్చుడో, సచ్చుడో అనే నినాదంతో పోరాడినం. ఇప్పుడు దొంగల, దోపిడీ దారుల చేతిలో తెలంగాణ బందీ అయ్యింది. ప్రొఫెసర్ జయశంకర్ కలలను నిజం చేయడానికి మరో పోరాటం చేస్తాం. కేంద్రం పేరు చెప్పి అభివృద్ధిని మరిచిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి’ అని బేగం ప్రజలకు పిలుపునిచ్చారు.