
ఒక మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. ఎంటర్‌టైన్ రంగం మీద ఆసక్తితో వీజేగా మారాడు. అంతటితో ఆగకుండా యూట్యూబర్, టీవీ హోస్ట్, యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు వీజే సిద్ధూ (VJ Siddhu). దాంతో సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇప్పుడు దయాంగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి డైరెక్టర్, హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నా యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా వీడియోలు చేస్తూ తన అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాడు.
వీజే సిద్ధు పర్సనల్ లైఫ్:
వీజే సిద్ధు పూర్తిపేరు సిద్ధార్థ్ వర్మ. 1997లో తమిళనాడులోని కుంభకోణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. స్కూలింగ్ స్థానికంగా ఉన్న లిటిల్ ఫ్లవర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పూర్తి చేశాడు. ఆ తర్వాత అన్నా విశ్వవిద్యాలయం అనుబంధంగా నడుస్తున్న ఈజీఎస్ పిళ్లే ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ ఎలక్ట్రికల్ చేశాడు. అయితే.. అతనికి చిన్నప్పటినుంచి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. అందుకే ఎప్పుడూ మ్యూజిక్ వినడం, డాన్స్, చిన్న చిన్న కామెడీ స్కిట్స్ చేస్తుండేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా అతను సాంకేతిక విషయాల కంటే క్రియేటివిటీ, కళల వైపే ఎక్కువ మొగ్గు చూపేవాడు.
ఆఫర్లు వదులుకుని
సిద్ధూ ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే కొన్ని జాబ్ ఆఫర్లు వచ్చాయి. కానీ.. అతను ఎలాగైనా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనే స్థిరపడాలి అనుకున్నాడు. అందుకే వాటన్నింటినీ వదులుకుని వీడియో జాకీగా లైఫ్‌ని మొదలుపెట్టాడు. అప్పుడే అతని పేరుకి ‘వీజే’ యాడ్ అయ్యింది. 2019లో జయ టీవీలో ‘‘కిలాడీ రాణి” రియాలిటీ గేమ్ షోలో హోస్ట్‌గా కనిపించాడు. కానీ, దానివల్ల అతని పెద్దగా గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత ప్రముఖ యూట్యూబ్ చానెల్ “బ్లాక్ షీప్”లో నెలకు 25 వేల రూపాయల శాలరీకి చేరాడు. అందులో వైరల్ ప్రాంక్ షో “ఫన్ పన్రోమ్”ని నడిపేవాడు. ఈ షోలో అతని కామెడీ, క్రియేటివ్ ప్రాంక్‌లు వ్యూయర్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘‘ప్లేబాయ్ ఆఫ్ సీఎస్‌కే’’, ‘‘దుబాయ్ సిరీస్” వీడియోలు మిలియన్ల వ్యూస్, లైక్స్‌తో అతన్ని జనాలకు దగ్గర చేశాయి. ఈ షోతో సిద్ధూకి పాపులారిటీ బాగా పెరిగి, కొన్ని రోజుల్లోనే పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు.
యూట్యూబ్‌లోకి..
ఫన్ పన్రోమ్ షో తర్వాత 2023 జూన్ 14న ‘వీజే సిద్ధూ వ్లాగ్స్’ పేరుతో సొంతంగా ఒక యూట్యూబ్ చానెల్ పెట్టాడు. అందులో రెగ్యులర్‌గా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రాంక్‌లతో పాటు ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ బ్లాగ్స్, డైలీ లైఫ్ వీడియోలు చేస్తున్నాడు. చానెల్ కొన్ని రోజుల్లోనే మిలియన్ సబ్‌స్క్రయిబర్ల మార్క్‌ని దాటింది. చానెల్ పెట్టి రెండున్నరేండ్లు కూడా కాలేదు. కానీ.. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య ఇప్పుడు 5.17 మిలియన్లకు చేరింది. ఇప్పటివరకు చానెల్‌లో 444 వీడియోలు అప్‌లోడ్ చేశాడు.
బిగ్‌బాస్‌లో..
సిద్ధూ సామాజిక సేవ చేసేందుకు ప్రత్యేకంగా ‘‘సింధనై సెయ్ విత్ సిద్ధు” అనే షోని హోస్ట్ చేశాడు. ఇది చాలామందిలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ సీజన్–3లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. ఇది అతని పాపులారిటీని మరింత పెంచింది. ఇప్పుడు అతను ఫుల్-టైమ్ యూట్యూబర్, టీవీ హోస్ట్, ఎంటర్‌టైనర్‌గా కెరీర్‌ని కొనసాగిస్తున్నాడు.
అప్పుడప్పుడు తమిళ యూట్యూబర్లతో కొలాబరేషన్స్ చేస్తూ యువతను ఇన్‌స్పైర్ చేస్తున్నాడు. సిద్ధూకి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. యూట్యూబ్, స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా కోట్లలో సంపాదిస్తున్నాడు.
ఫ్యామిలీ వ్లాగ్స్
వీజే సిద్ధూకి 2018లో పునితా షాలినితో పెండ్లి జరిగింది. వాళ్లకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు సిడ్షాల్స్ ఇనియాజ్. అతని భార్యతోపాటు కూతురు కూడా రెగ్యులర్‌గా వ్లాగ్స్‌లో కనిపిస్తోంది. అంతేకాదు.. కూతురికి కూడా ప్రత్యేకంగా ‘‘ఇని వ్లాగ్స్” పేరుతో ఒక చానెల్ ఉంది. అందులో ఆమె చేసే చిలిపి పనులు, ఫ్యామిలీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తుంటాడు. ఈ చానెల్‌కు కూడా ఏడున్నర లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
సినిమా చాన్స్
సిద్ధూకి ఉన్న క్రేజ్ వల్ల కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 2021లో తమిళంలో వచ్చిన ట్రిప్ సినిమాలో నటించాడు. ఇక యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక అశ్వత్ మారిముత్తు డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన డ్రాగన్ సినిమాలో నటించే అవకాశం దక్కింది.
ఈ క్రమంలో అతనికి పెద్ద బ్రేక్ వచ్చింది. దాంతో అతనికి హీరోగా నటించడమే కాదు.. తన సినిమాకు తానే డైరెక్షన్ చేసే అవకాశం దక్కింది. కొన్ని నెలల క్రితం ‘వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ అనే ప్రముఖ సంస్థ సిద్ధూతో ఒక సినిమా తీస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘దయాంగరం’ అని పేరు పెట్టారు.
Title epdi iruku? Bayangarama, illa #Dayangaram -ah?
— Vels Film International (@VelsFilmIntl) May 3, 2025
Witness our namma veettu entertainer making his grand entry to the big screen 💥
▶️ https://t.co/DjHvQobSfu@IshariKGanesh @VJSiddhuOG @VelsFilmIntl @kushmithaganesh @nitinsathyaa @prosathish #RuleBreaker #VJSiddhu pic.twitter.com/aUzVAkyH4I