“సహాయం (Help/Support)”: అనే మాట చాలా గొప్పది. చేసే మాట సాయం కావొచ్చు.. ఇచ్చే డబ్బు సాయం కావొచ్చు. చూసే ఉద్యోగం సహాయం అవ్వొచ్చు. ఇలా ఏ విధమైన సహాయమైన.. పడిపోతున్న మనిషికి కాస్తా ఊరటని ఇస్తుంది. కొన్నిసార్లు అలాంటి చిన్న సహాయమే ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అయితే, జీవితంలో ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత కూడా మనకు అందిన ఆ సహాయాన్ని గుర్తుంచుకోవడం చాలా అరుదైన గుణం. అలాంటి కృతజ్ఞతాభావం వ్యక్తిత్వాన్ని గొప్పగా నిలబెడుతుంది. అదే గురు-శిష్య బంధానికి నిజమైన ప్రతీకగా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి వ్యక్తి కథే ఇది.
బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ (Anupam Kher) తన గురువు మహేష్ భట్ (Mahesh Bhatt)ల మధ్య ఉన్న బంధం సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా నిలుస్తోంది. గత 41 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ గురు-శిష్య సంబంధం ఇప్పటికీ అదే గౌరవంతో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా తాజాగా తన గురువు భట్పై ఉన్న కృతజ్ఞతను నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి వెల్లడించారు. 1984లో విడుదలైన సారాంశ్ (Saaransh) మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అనుపమ్, ప్రతి సినిమా చేసిన తర్వాత గురువైన మహేష్ భట్‌కు రూ.25,000 ఇవ్వడం ఇప్పటికీ కొనసాగుతున్న ‘సంప్రదాయం’ (Ritual) అని తెలిపారు.
అయితే, కెరీర్ ప్రారంభంలో రూ.250తో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు రూ.25,000కు చేరిందని చెప్పారు. గురువుపట్ల గౌరవానికి సంకేతంగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు యాక్టర్ అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. అలాగే, ‘సారాంశ్’ సమయంలో ఎదురైన కష్టాలను గుర్తు చేసుకుంటూ, చివరకు అదే సినిమా తన కెరీర్‌కు మలుపుతిప్పిందని వెల్లడించారు.
ఇకపోతే.. 1984లో విడుదలైన సారాంశ్ సినిమా ద్వారా అనుపమ్ ఖేర్‌కు డైరెక్టర్ మహేష్ భట్ తొలి అవకాశాన్ని ఇచ్చారు. ఆ సమయంలో కేవలం 27 ఏళ్ల వయసులోనే వృద్ధుడి పాత్ర పోషించి అనుపమ్ ఖేర్ విశేష ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు మలుపుతిప్పిన ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ అవకాశానికి కృతజ్ఞతగా, అనుపమ్ ఖేర్ ఇప్పటికీ ప్రతి సినిమా చేసిన తర్వాత మహేష్ భట్‌కు ఒక నిర్దిష్ట మొత్తాన్ని అందించడం విశేషం..
అనుపమ్ ఖేర్పై భట్ ప్రశంసలు:
ఇటీవల కూడా ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడింది. అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన తన్వి ది గ్రేట్' (Tanvi The Great) ప్రాజెక్ట్‌పై మహేష్ భట్ ప్రశంసలు కురిపిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన శిష్యుడి విజయంపై గర్వంగా ఉందని తెలిపారు.
అయితే, ‘సారాంశ్’ సమయంలో అనుపమ్ ఖేర్ ఎదుర్కొన్న మొదటి కష్టాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. తొలుత ఆ పాత్రకు ఆయనను ఎంపిక చేసినప్పటికీ, తరువాత సంజీవ్ కుమార్ ను తీసుకోవాలని నిర్ణయించడంతో అనుపమ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ ఆవేశంతో మహేష్ భట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, చివరకు ఆయన అంకితభావాన్ని గుర్తించిన దర్శకుడు మళ్లీ అదే పాత్రకు అనుపమ్ ఖేర్‌ను ఎంపిక చేశారు. ఈ విధంగా ప్రారంభమైన వారి అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుండటం బాలీవుడ్‌లో అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. గురు-శిష్య సంబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ బంధం సినీ వర్గాల్లో ప్రేరణగా మారింది.
