
- అనారోగ్యంతో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ తుదిశ్వాస
- వందకు పైగా సినిమాల్లో నటన
- ఆది సినిమాలోని ‘తొడకొట్టు చిన్నా’ డైలాగ్‌తో ఫేమస్
హైదరాబాద్/ చందానగర్, వెలుగు: సినీ నటుడు ఫిష్ వెంకట్(53) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఫిష్ వెంకట్‌కు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ కోసం కుటుంబసభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
వెంకట్‌కు రెండు కిడ్నీలు మార్చాలని డాక్టర్లు తెలిపారు. దీంతో కిడ్నీ డోనర్ల కోసం వెతుకుతున్నామని, తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, దాతలు ఆదుకోవాలంటూ ఇటీవల ఆయన కుమార్తె మీడియా ముందుకు వచ్చి వాపోయింది. కానీ ఇంతలోనే పరిస్థితి విషమించి వెంకట్ చనిపోయారు. కాగా, ఫిష్ వెంకట్ కుటుంబం రాంనగర్‌లో నివాసం ఉంటోంది. ఆయనకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. ఫిష్ వెంకట్ మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
శ్రీహరి ప్రోత్సాహంతో..
ఓ మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయమై, ఆయన నిర్మించిన ‘జంతర్ మంతర్’ అనే చిత్రంలో బందిపోటుగా చిన్న వేషంతో సినీ నటుడిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత పాతబస్తీ, రవన్న లాంటి పలు చిత్రాల్లో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు చాలానే పోషించారు. ‘ఖుషి’లో వెంకట్ డైలాగ్ డెలివరీ నచ్చి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వీవీ వినాయక్ తెరకెక్కించిన ‘ఆది’ చిత్రం నటుడిగా వెంకట్‌కు బ్రేక్ ఇచ్చింది. వెంకట్ డైలాగ్ డిక్షన్ నచ్చి వీవీ వినాయక్ పట్టుబట్టి ఆయనతోనే డబ్బింగ్ చెప్పించారు. అది క్లిక్ అవడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ మాండలికాన్ని ఆయన పలికే తీరు నచ్చి చాలామంది అవకాశాలు ఇచ్చారు. అందుకే ఇండస్ట్రీలో తనకు వీవీ వినాయక్ గాడ్ ఫాదర్ అని ఫిష్ వెంకట్ చెప్పేవారు. అలాగే శ్రీహరి కూడా తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా ఇండస్ట్రీలోని దాదాపు స్టార్ హీరోలు అందరితో ఫిష్ వెంకట్ నటించారు. దిల్, బన్నీ, ఢీ, చెన్నకేశవ రెడ్డి, యోగి, కృష్ణ, కింగ్, డాన్ శీను, మిరపకాయ్, దరువు, బుజ్జిగాడు, రెడీ, అత్తారింటికి దారేది, రచ్చ, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, ఖైదీ నెంబర్ 150 వంటి సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఫిష్ వెంకట్ చివరగా నటించిన చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. ఈ సినిమా రీసెంట్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలైంది.