V6 News

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏ విషయంలో కోర్టుకెళ్లారంటే..

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏ విషయంలో కోర్టుకెళ్లారంటే..
  • తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని కోర్టుకు విజ్ఞప్తి
  • సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లకు నోటీసులిచ్చిన కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో జరుగుతున్న తన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరఫు అడ్వకేట్‌‌ శివ్ వర్మ (ఎన్టీఆర్ వర్సెస్ అశోక్ కుమార్/జాన్డో, ఇతరులు) పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌‌ను జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఏకసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ఎన్టీఆర్ తరఫున అడ్వకేట్ సాయి దీపక్ వాదిస్తూ..వివిధ ఈ-కామర్స్ వెబ్‌‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లలో ఎన్టీఆర్ ఫొటోలు, పేరు, గ్లామర్‌‌ను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగిస్తూ వ్యక్తిత్వ హక్కులను దెబ్బతీస్తున్నాయని, ఆయన పరువుకు భంగం కలిగిస్తున్నాయని కోర్టుకు చెప్పారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్‌‌ మీడియేటరీ గైడ్‌‌లైన్స్ & డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్-2021 ప్రకారం ఎన్టీఆర్ దావాను అధికారిక ఫిర్యాదుగా పరిగణించింది. ఈ కంప్లైంట్ పై మూడు రోజుల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ- కామర్స్ ప్లాట్ ఫాం లు, సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది.విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అదే రోజు ఈ కేసులో ఎన్టీఆర్ వ్యక్తిత్త హక్కులకు సంబంధించి సమగ్ర ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.