బ్యాడ్ బాయ్స్​కి ఫాలోయింగ్ ఎక్కువ!

బ్యాడ్ బాయ్స్​కి ఫాలోయింగ్ ఎక్కువ!

వెరైటీని కోరుకుంటాడు. పాత్ర బాగుంటే ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. నాని గురించి అందరూ ఇదే చెబుతారు. ఆడియెన్స్‌‌కి డిఫరెంట్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ కలిగించడానికి నాని మరోసారి రిస్క్‌‌ తీసుకున్నారు. ఆయన నెగిటివ్‌‌ రోల్‌‌లో నటించిన ‘వి’ ఈ నెల 5న ఓటీటీలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా నాని ఇలా ముచ్చటించారు.

స్ర్కిప్ట్​ విన్నప్పుడే చాలా ఇన్​స్పయిర్ అయ్యాను. ప్రతి సీన్​ని చాలా ఎంజాయ్ చేశాను. ఇంద్రగంటి చేసిన సినిమాలన్నింటిలోకి ఇది డిఫరెంట్ కమర్షియల్ మూవీ. ఆయన గత సినిమాలతో పోలిస్తే దీనికి బాగా ఎగ్జైట్ అయ్యారు కూడా. మేకింగ్​లో చాలా డిఫరెన్స్ చూపించారు.

ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే రిలీజ్ చేద్దామనుకున్నాం. వీలుకాక ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఇదొక కొత్త ఎక్స్​పీరియెన్స్. కానీ ప్రతి ఒక్కరికీ థియేటర్లో చూస్తేనే బాగుంటుందనే ఫీలింగ్ అయితే ఉంది. ట్రైలర్  రిలీజయినప్పటి నుంచి సినిమాపై అందరూ అంచనాలు పెంచేసుకున్నారు.

ఇంద్రగంటితో మూడు సినిమాలు చేసినా ఆయనలో కానీ, నాలో కానీ ఎలాంటి మార్పు లేదు. ‘అష్టాచమ్మా’ నుంచి ట్రావెల్ అయిన వారిలో నేను, ఇంద్రగంటి, కెమెరామెన్ విందా ముగ్గురం డెవెలప్ అయ్యాం. కలిసి పెరిగిన క్లాస్​మేట్స్​లా ఉంది మా పరిస్థితి.

రెగ్యులర్ సినిమాల్లోలా ఇందులో కనిపించను. సినిమా స్టార్ట్ అయ్యాక ఇరవై నిమిషాల తర్వాత ఎంటరవుతాను. కానీ సినిమా అంతా ఉంటాను. దీన్ని మల్టీస్టారర్‌‌‌‌లా చూడలేదు నేను. నాదొక పాత్ర. తనదొక పాత్ర  అనుకున్నాను. సుధీర్ చాలా బాగా చేశాడనిపించింది. రక్షకుడికి, రాక్షసుడికి మధ్య పోరాటమే ఈ మూవీ. చాలా గ్రిప్పింగ్​గా ఉంటుంది.  నా పాత్ర ఎంత నెగిటివ్ అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.  ఇప్పుడందరూ విలన్స్​నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బ్యాడ్ బాయ్స్​కి ఫాలోయింగ్ ఎక్కువ.

ఉగాది కానుకగా మార్చిలో విడుదలవ్వాల్సిన సినిమా ఇది. రిలీజ్​కి ముందు జనతా కర్ఫ్యూ వచ్చింది.. ఒక్కరోజే అనుకున్నాం. కానీ ఏదో ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. దీంతో బాగా డిజప్పాయింటయ్యాం.  ఎదురుచూసి చూసి నాకు నీరసం వచ్చేసింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. దిల్ రాజు అన్నిరకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఆయన చాలామందికి సమాధానం చెప్పాలి. అందుకే ఆయన నిర్ణయాన్ని మేమంతా సపోర్ట్ చేశాం.

లాక్ డౌన్లో చాలా నేర్చుకోవాలని ప్రయత్నించాను కానీ ఏం నేర్చుకోలేదు. అమ్మ దగ్గర వంట నేర్చుకుందామనుకున్నా.. అవ్వలేదు. సిక్స్ ప్యాక్ చేసేద్దామనుకున్నా.. తినడం, పడుకోవడం తప్ప ఏం చేయలేదు.  పూర్తిగా నా కొడుకు జున్నుగాడితో గడిపేశా. మళ్లీ షూటింగ్​కి వెళ్తే ఎలా అనిపిస్తుందో మరి.

నెక్ట్స్​ ఎలా ఉండబోతోందనే అనే విషయంలో క్లారిటీ లేదు. పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. కొంతమందికి పనిచేస్తే కానీ రోజులు గడవని పరిస్థితి. మనం ఎంత హెల్ప్ చేసినా అది నామమాత్రమే. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లడమే బెటరనిపిస్తోంది. నేనైతే రెమ్యునరేషన్‌‌ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉంటాను. సినిమాకి బిజినెస్ తగ్గితే కచ్చితంగా
రెమ్యునరేషన్​ తగ్గించుకోవాలి. ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు.

స్క్రిప్ట్ బాగుంటేనే చేయడానికి రెడీ అవుతాను. కథ నచ్చితే హిందీ మూవీ అయినా ఓకే అంటాను. 2022 వరకు సరిపడా సినిమాలున్నాయి చేతిలో. టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్​తో పాటు ఒక డెబ్యూ డైరెక్టర్​తో, మరో దర్శకుడితో సినిమాలు చేయాల్సి ఉంది. ‘టక్ జగదీష్’ యాభై శాతం పూర్తయింది. ‘శ్యామ్ సింగరాయ్’ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ‘టక్ జగదీష్’ పూర్తవగానే ఇది మొదలవుతుంది.

ఇది నా 25వ సినిమా. అలా అని స్పెషల్‌‌గా ప్లాన్ చేయలేదు. అది నెంబర్ మాత్రమే. నాకు ఏ మూవీ అయినా ఒక్కటే.  ఇరవై నాలుగో సినిమా ఎలా చేశానో ఇదీ అంతే. ఇంతవరకు వచ్చానంటే ఆడియెన్స్‌‌ బ్లెస్సింగ్స్‌‌ వల్లే. ముందు ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

‘అష్టాచమ్మా’ విడుదలైన  సెప్టెంబర్ 5నే ‘వి’ కూడా రిలీజ్ చేయాలనేది అమెజాన్ వాళ్ల ఐడియా.  రెండొందల దేశాల్లో సినిమా రీచ్ అవుతుందంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ లెక్కన పది రోజులపాటు ధియేటర్లో చూసేవాళ్లంతా ఒక్క రోజులోనే ఓటీటీ ద్వారా చూసేస్తారు.

నా ప్రతి సినిమానీ 8.45కి ఐమ్యాక్స్​లో చూడటం నాకు సెంటిమెంట్. ఈసారి ఆ చాన్స్ లేదు. టీవీలోనే చూడాలి. ప్రివ్యూ థియేటర్ బుక్ చేసి మా ఫ్యామిలీకి సినిమా చూపించాను. నేను ఐదుసార్లు సినిమా చూశాను. ఐదంటే రోమన్ నెంబర్స్ లో ‘వి’.

For More News..

వరల్డ్‌ ఓపెన్‌ చెస్‌ టైటిల్‌ సాధించిన తొలి ఇండియన్

మారటోరియం వడ్డీ కట్టాల్సిందే!

పాత బండ్లు తెగకొంటున్రు