
ఇటీవల ఓ సినిమా షూటింగులో గాయపడ్డ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్రచికిత్స సమయంలో, పృథ్వీరాజ్ మృదులాస్థి, క్రూసియేట్ లిగమెంట్ వంటి గాయాలకు చికిత్స పొందినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. పృథ్వీరాజ్ కొద్ది నెలల్లో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా డాక్టర్లు వెల్లడించారు.
జూన్ 25 మధ్యాహ్నం ఇడుక్కి జిల్లా మరయూర్‌లో 'విలాయత్ బుద్ధ' అనే సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా పృథ్వీరాజ్ గాయపడ్డాడు. ఈ క్రమంలో జూన్ 27న తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులు, అనుచరుల కోసం ఆయన హెల్త్ అప్ డేట్ పై సమాచారమిచ్చారు. "విలాయత్ బుద్ధా'లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు నాకు ప్రమాదం జరిగింది. నాకు కీహోల్ సర్జరీ జరిగింది. అదృష్టవశాత్తూ ఇప్పుడు నేను కోలుకుంటున్నాను. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫిజియోథెరపీ కూడా జరుగుతోంది" అని పృథ్వీ ఒక ప్రకటనలో తెలిపారు.
పృథ్వీ రాజ్ కు గాయాలు కావడంతో జయన్ నంబియార్ దర్శకత్వంలో సందీప్ సేనన్ నిర్మిస్తున్న విలయత్ బుద్ధ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. జీఆర్ ఇందుగోపాల్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.